Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణ రైతులకు శుభవార్త

తెలంగాణ రైతులకు శుభవార్త

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వ్యవసాయాన్ని పండగ చేయడమే కాంగ్రెస్ విధానమని సిఎం వ్యాఖ్యానించారు.

రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని… ఆ ప్రకారం రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. శుక్రవారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ఇస్తానన్న సోనియాగాంధీ మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. మే 6, 2022లో వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు.

డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించి రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. ఈ మధ్య కాలంలో తీసుకున్న రుణాలను కూడా మున్ముందు మాఫీ చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేస్తున్నామన్నారు.

రైతు భరోసా పథకాన్ని కూడా పారదర్శకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ సంఘాన్ని రూపొందించినట్లు చెప్పారు. జులై 15వ తేదీ నాటికి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసిందని సిఎం వివరించారు.

లోక్ సభ ఎన్నికల సమయంలో సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా రుణ మాఫీకి కార్యాచరణ ప్రకటించటం…మంత్రివర్గం ఆమోదముద్ర వేయటం హర్షనీయమని రైతు సంఘాలు ప్రశంసిస్తున్నాయి.

–దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్