Monday, January 20, 2025
HomeTrending Newsప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలి : మంత్రి కేటీఆర్

ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలి : మంత్రి కేటీఆర్

ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలే త‌ప్ప అణ‌గ‌దొక్క‌కూడ‌ద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. రాష్ట్రం బ‌లంగా ఉంటేనే దేశం బ‌లంగా ఉంటుంది. ఉత్ప‌త్తి రంగం బ‌లోపేతానికి కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాలి. కేంద్రం మంచి ప‌ని చేస్తే మెచ్చుకుంటాం.. చెడ్డ ప‌ని చేస్తే విమ‌ర్శిస్తాం అని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజకీయ వ్యూహాలు చేయాల‌ని కేటీఆర్ సూచించారు.
తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ వార్షిక నివేదిక‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారులు, ప్ర‌తినిధులు పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2.32 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 16.48 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు వ‌చ్చాయ‌న్నారు. వీధి వ్యాపారుల‌కు సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారించామ‌న్నారు. రాష్ట్రాన్ని పెట్టుబ‌డుల కేంద్రంగా మార్చేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎక్క‌డికి వెళ్లినా టీఎస్ ఐపాస్ గురించి మాట్లాడుతున్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంలో జాప్యం చేస్తే జ‌రిమానా వేసే రాష్ట్రం మ‌న‌ది ఒక్క‌టే అని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త ప‌థ‌కాలు తేవ‌డం కాదు.. వాటిని క‌చ్చితంగా అమ‌లు చేసేందుకు కృషి చేయాలి. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు త‌గిన‌ట్లుగా ముందుకు వెళ్తున్నామ‌ని తెలిపారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

దేశాభివృద్ధే ప్ర‌ధాన అజెండా కావాలి..
6 పారిశ్రామిక కారిడార్‌ల‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపినా కేంద్రం నుంచి స్పంద‌న లేద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. విభ‌జ‌న చ‌ట్టంలోని పారిశ్రామిక ప్రోత్సాహ‌కాల‌ను ఇంకా ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు. గుజ‌రాత్‌లో గిఫ్ట్ సిటీ పెట్టండి.. ఇత‌ర రాష్ట్రాల‌కూ గిఫ్ట్ ఇవ్వండి. స‌బ్ కా సాత్, స‌బ్ కా వికాస్‌ను కేంద్రం చేత‌ల్లో చూపాల‌న్నారు. ఎన్నిక‌లు లేన‌ప్పుడు దేశాభివృద్ధే ప్ర‌ధాన అజెండా కావాల‌ని చెప్పారు. నిత్యం రాజ‌కీయాలు చేస్తే ఎప్ప‌టికీ మూడో ప్ర‌పంచ దేశంగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో హ‌రిత‌, శ్వేత‌, నీలి, పింక్‌తో పాటు ప‌సుపు విప్ల‌వం మొద‌లైంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

పారిశ్రామిక అభివృద్ధికి ఆ మూడు అవ‌స‌రం..
రాష్ట్రానికి అనేక ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి.. అనేక పారిశ్రామిక‌వేత్త‌ల‌తో నిత్యం మాట్లాడుతున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా పారిశ్రామిక‌వేత్త‌ల పాత్ర కూడా కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రం ఏర్ప‌డిన కొత్త‌లో అనేక ఇబ్బందులు ప‌డ్డామ‌ని గుర్తు చేశారు. కానీ పొరుగు రాష్ట్రాల‌తో పోటీ ప‌డి అనేక ప‌రిశ్ర‌మ‌లు తెచ్చుకున్నామ‌ని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి మూడు ఐలు కీల‌కంగా గుర్తించామ‌ని తెలిపారు. ఇన్నోవేష‌న్, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ మా నినాదం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Also Read : సివిల్స్ విజేత‌ల‌ను అభినందించిన మంత్రి కేటీఆర్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్