శాసనసభ, మండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో జులై 25 లేదా 26వ తేదీల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పది రోజుల్లో రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు పలు బిల్లులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్నారు. ఏయే శాఖలకు ఎంత కేటాయింపులు జరపాలనే అంశంపై అధికారులతో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు.
నిరుద్యోగం, పోటీ పరీక్షల వాయిదా, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్ష నేతలు కసరత్తు చేస్తున్నారు.