Monday, March 16, 2026
HomeTrending Newsత్వరలో పాతబస్తీ ఫైల్స్ వస్తుంది - బిజెపి

త్వరలో పాతబస్తీ ఫైల్స్ వస్తుంది – బిజెపి

సీఎం చంద్రశేఖర్ రావుకు పనిపాట లేక గంటల తరబడి మీడియా సమావేశం పెడుతున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, బండి సంజయ్ విమర్శించారు. వయోభారం కారణంగా ముఖ్యమంత్రి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకు అర్ధం కావడం లేదన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్… ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహారశైలి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపించారు. సమస్యలు సృష్టించి ప్రజల దృష్టిని ప్రభుత్వ తప్పిదాల నుంచి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని, పారాబాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పి, కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పి, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్రవిధానం లేక, కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారని, ఖరీఫ్ సీజన్ (వర్షాకాలం) లో ఇవ్వాల్సిన పంట ఇంకా ఇవ్వలేదని సంజయ్ అన్నారు.

బియ్యం కుంభకోణంలో టీఆర్ఎస్ నేతల బండారం బయట పడుతుందన్న భయంతో వేరే అంశాలపై సి.ఎమ్ మాట్లాడుతున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. మధ్యవర్తిగా రైతుల నుంచి  ధాన్యం కొనుగోలు చేయలేక చేతులు ఎత్తేసి కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారని, ఇన్ని రోజులు బియ్యం కొనుగోలు చేయాలని కోరి, ఇప్పుడేమో వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలు చూసి బేజారయిన ముఖ్యమంత్రి కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి జంకుతున్నారని బండి సంజయ్ వ్యంగ్యంగా విమర్శించారు. “కాశ్మీర్ ఫైల్స్” కు వ్యతిరేకంగా మాట్లాడే ముఖ్యమంత్రికి డీఎన్ఎ టెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్, చైనాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, త్వరలో “పాతబస్తీ ఫైల్స్”, “అవినీతి ఫైల్స్” బయటకు వస్తాయని సంజయ్ చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్ రజాకార్ల పాలన నడిపిస్తున్నారని, భోధన్ లో బిజెపి కార్యకర్తలు, హిందువులపై కేసులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఎంతమంది స్ట్రాటజిస్ట్ లను తెచ్చుకున్నా బిజెపిని ఏం చెయ్యలేరని, అవినీతి యూపీఎ పాలనలో కేంద్ర మంత్రిగా కేసీఆర్ భాగస్వామి అన్నారు. పాకిస్తాన్ ప్రధాని భారత ప్రభుత్వాన్ని, విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తుంటే … కేసీఆర్ మాత్రం విమర్శలు చేస్తున్నారని, ఇమ్రాన్ కు ఉన్న బుద్ధి, కేసీఆర్ కు లేదని విమర్శించారు. ఉక్రెయిన్ విధ్యార్ధులను స్వదేశానికి రప్పించిన ఘనత కేంద్రానిది అయితే… కేసీఆర్ తన ఘనతగా చెప్పుకుంటున్నారని, కేసీఆర్ ఒక మోసకారి, నిత్యం రాజకీయాలతో కాలం గడుపుతున్నారని బండి సంజయ్ విమర్శించారు.

Also Read : బోడి బెదిరింపులకు భయపడం – కెసిఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular