Thursday, May 9, 2024
HomeTrending Newsకశ్మీర్ ఫైల్స్ లో అవాస్తవాలు - సిపిఎం

కశ్మీర్ ఫైల్స్ లో అవాస్తవాలు – సిపిఎం

కశ్మీర్ ఫైల్స్ సినిమాలో వాస్తవాలు పూర్తి స్థాయిలో చూపలేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, బృందా కారత్ విమర్శించారు. కశ్మీర్ పండిట్లు తీవ్రమైన అణచివేత కు గురయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదని, దేశంలో ఎవరూ ఎదుర్కొని హింసను వారు ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం నేత మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపేందుకు బృందాకరత్ ఈ రోజు నల్గొండ వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ తీరుపై విమర్శల వర్షం కురిపించారు.

ఉగ్రవాదుల చేతిలో హింసకు గురైంది కశ్మీర్ పండిట్లు మాత్రమే కాదని, మొత్తం కాశ్మీరీలు హింసకు గురయ్యారన్నారు. ఆరెస్సెస్, బిజెపిలు తమ స్వార్ధ రాజకీయాలు కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కశ్మీర్లో  సిపిఎం పార్టీ ఎమ్మెల్యే యూసఫ్ తరిగామి కుటుంబంలో ఇద్దర్ని ఉగ్రవాదులు బలితీసుకున్నారని, ఎంతో మంది ముస్లిం లీడర్ల ను ఉగ్రవాదులు చంపారని చెప్పారు. అవన్నీ మరుగున పడేస్తూ కేవలం ఒక వర్గానికి మాత్రమే నష్టం జరిగినట్లుగా ప్రచారం చేయడం తగదని బృందా కారత్ పేర్కొన్నారు.

తమ స్వార్ధ రాజకీయాల కోసం బిజెపి ప్రభుత్వాలు కూడా ఆ సినిమాను ప్రమోట్ చేస్తున్నాయని, కశ్మీరీలపై హింస, గుజరాత్ మారణహోమం, సిక్కుల ఊచకోత దేనికవే ప్రత్యేకంగా చూడాలన్నారు. ఒకటి తక్కువ మరొకటి ఎక్కువ అని చూడవద్దన్నారు. ఇప్పటికి గుజరాత్ మారణహోమం బాధితులకు న్యాయం జరగలేదన్నారు. బిజెపి ఇప్పటికే కశ్మీర్ సమస్యను జటిలం చేసిందని, ఇప్పుడు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చేందుకు దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారానికి దిగిందని బృందా కారత్ ఆరోపించారు.

Also Read : ‘ద కశ్మీర్ ఫైల్స్’ తెలుగులో డబ్ చేస్తాం : నిర్మాత అభిషేక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్