సరళా సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శాసనసభలో ఈ రోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా రెండు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చారు.
కోయిల్ సాగర్ ప్రాంతాన్ని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రూ. 8 కోట్ల 30 లక్షలతో ప్రతిపాదన పంపామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందగానే అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. సరళా సాగర్ కూడా అద్భుతమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
తెలంగాణ ప్రాంతానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఇక్కడున్న చారిత్రాత్మక కట్టడాలు, జలపాతాలు, అడవులు ప్రసిద్ధి గాంచినవి. గతంలో చాలా నిర్లక్ష్యానికి గురైనవి. పర్యాటకంలో 14.69 శాతం అభివృద్ధి జరిగిందన్నారు. అత్యధిక సంఖ్యలో ఊహించని రీతిలో రాష్ట్రానికి పర్యాటకులు వస్తున్నారు. గతంలో 70 లక్షల మంది వస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత కరోనా కంటే ముందు 3 కోట్ల మంది పర్యాటకులు రాష్ట్రానికి వచ్చారు. కొత్తగా నిర్మించిన అనేక రిజర్వాయర్లను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కోయిల్ సాగర్ వద్ద ఈ నెల 17న బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. కాటేజీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కరివెనను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రసిద్ధి గాంచిన దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. సోమశిల రిజర్వాయర్ వద్ద అద్భుతమైన కాటేజీలను నిర్మించామన్నారు. నెల రోజుల ముందే బుకింగ్ అవుతున్నాయని తెలిపారు. నాగార్జున సాగర్ వద్ద ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
Also Read : హైదరాబాద్ అభివృద్ధికి బహుముఖ వ్యూహం