MLC Election Result: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి విజయం సాధించారు. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార వైసీపీ ఏడు అభ్యర్ధులను తొలుత ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ బిసి నేత, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధను బరిలోకి దించింది.

అయితే మొత్తం 23మంది టిడిపి ఎమ్మెల్యేల్లో నలుగురు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన ఎమెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీ వెంట నడుస్తున్నారు. అయితే అధికార పార్టీ నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినా.. తమ విజయానికి ధోకా లేదని వైసీపీ ధీమాగా ఉంది.  తీరా ఫలితం వెలువడ్డాక మొత్తం 23 సీట్లు రావడంతో కంగు తినడం వైసీపీ వంతయ్యింది.

వైసీపీ నుంచి పోటీ చేసిన మర్రి రాజ శేఖర్, బొమ్మి ఇజ్రాయెల్, ఏసురత్నం, పోతుల సునీత, పెన్మత్స సూర్య నారాయణ రాజు  లు విజయం సాధించారు. మరో ఇద్దరు అభ్యర్ధులు జయమంగళ వెంకట రమణ, కోలా గురువులు చెరో 21 ఓట్లు సాధించారు. దీనితో రెండో ప్రాధ్యాన్యతా ఓట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేయగా చివరకు విజయం జయమంగళ వెంకట రమణనే వరించింది.  కోలా గురువులుఓటమి పాలయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *