Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసినిమా టైటిళ్లలో సినామికల సందD!

సినిమా టైటిళ్లలో సినామికల సందD!

Telugu Cinema titles- Language: పలకా బలపం ఇచ్చి చిన్నప్పుడు అక్షరాలను బాగా దిద్దిస్తారు. జీవితానికి అదే దిద్దుబాటుగా మొదలవుతుంది. ఎంత ఎక్కువగా దిద్దుతుంటే అంత బాగా అక్షరాలు ఒంటబడతాయి. పలకలు దాటి మూడు, నాలుగో తరగతుల్లో కాపీ బుక్కులు మొదలవుతాయి. చుక్కల గీతల మధ్య రాసిన అక్షరాలనే రాస్తూ ఉండాలి. రాసి రాసి వేళ్లు అరిగిపోవాలి. రాసి రాసి పెన్సిల్ ముక్కలు విరిగిపోతూ ఉండాలి.

లేపాక్షి ఎలిమెంటరీ స్కూల్లో మా ఒకటో తరగతి టీచర్ ఈశ్వరమ్మ మృదువుగా చెబుతుండేవారు– బలపం అరిగిపోయేదాకా పలకమీద అక్షరాలను దిద్దుతూనే ఉండాలని. రెండో తరగతిలో సుశీలమ్మ టీచర్ కటువుగా కర్ర పట్టుకుని చెబుతూనే ఉండేవారు- అందమయిన అక్షరాలను అంతే అందంగా రాయాలని. లేపాక్షి వివేకానంద జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరేడు తరగతుల్లో తెలుగు టీచర్ లోకభూషణం సార్ చేతిలో చింత కొమ్మ సాక్షిగా విరామ చిహ్నాలు ఎంత ప్రధానమో విసుగులేకుండా వివరిస్తూనే ఉండేవారు. ఏళ్లతరబడి సంస్కృతం, తెలుగు వ్యాకరణం చెప్పిన కర్రా వెంకటసుబ్రహ్మణ్యం సార్ అలుపు లేకుండా చెబుతూనే ఉండేవారు– అర్థం కాని పదాలతో అర్థం లేకుండా, అర్థం కాకుండా రాయద్దని. జర్నలిజం లో భాష బోధించిన డి. చంద్రశేఖర్ రెడ్డి సార్ చెబుతూనే ఉండేవారు- అత్యంత సరళంగా రాయాలని.

పాపం… మా టీచర్ల తప్పేమీ లేదు. అవ్యాజమయిన శిష్య ప్రేమతో వారు పాఠాలు చెప్పారు. మమ్మల్ను సంస్కరించడానికి, మాకు నాలుగు అక్షరం ముక్కలు నేర్పడానికి వారు చేయని ప్రయత్నం లేదు. మేమే సరిగ్గా అక్షరాలను దిద్దుకోలేదు. సరిగ్గా కాపీ బుక్కులు రాయలేదు.సరిగ్గా విరామ చిహ్నాలను నేర్చుకోలేదు. సరిగ్గా చదువుకోలేదు. బలపాలను తినేశాము. పెన్సిల్ ముక్కలు విరిచేశాము. పెన్నులో ఇంకు చొక్కాలపై పోసుకున్నాము. నోటు బుక్కు కాగితాలతో పడవలు చేసి నీటిపాలు చేసుకున్నాము. యాభైలు దాటి జుట్టు నెరిసి, పళ్లు కదిలి, కళ్లకు అద్దాలు వచ్చిన ఈ వయసుల్లో…అప్పుడు బలపంతో ఇంకా బాగా దిద్దుకుని ఉంటే; పెన్సిల్ తో ఇంకా బాగా రాసి ఉంటే; ఇంకా బాగా చదువుకుని ఉంటే…అని ఇప్పుడు బాధపడుతున్నాము. ఇలాగే అయ్యి పెద్దయ్యాక ఏడుస్తూ ఉంటార్రా…అని రెండో మాటకు తావు లేకుండా మా రెండో తరగతి టీచర్ సుశీలమ్మ ఆనాడే ఎంతో సౌశీల్యంతో చెప్పారు. అందుకే మా నాన్నకు నా అక్షరదోషాలను, అన్వయ దోషాలను సరిదిద్దడానికే సమయం చాలడం లేదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ప్రయోజనమేముంది?

ఈరోజు పేపర్లో మూడు నాలుగు సినిమా ప్రకటనలు, వార్తల్లో అక్షరాలను ఎలా చదువుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. చిన్నప్పటినుండి యూనివర్సిటీల దాకా మా టీచర్లు చెప్పినట్లు బుద్ధిగా దిద్దుకుని ఉంటే, చదువుకుని ఉంటే నాకిప్పుడు ఇలా అక్షరాలు అర్థంకాని అయోమయం తప్పి ఉండేది కదా! అని అక్షయమయిన అక్షర దుఃఖం పొంగుకొస్తోంది!

ఆడవాళ్లు మాకు జోహార్లు

బహుశా ఇది- “ఆడవాళ్లూ! మీకు జోహార్లు” అయి ఉంటుందని నాలాంటి తెలుగు కలిపి కలిపి కష్టంగా చదువుకునేవారికి నెమ్మదిగా అర్థం కావచ్చు. కాకపోవచ్చు. లేక కథాపరంగా ఆడవాళ్లు మీకు జోహార్లు చెబుతున్నారు అని వేరే అర్థం అయినా ఉండి ఉండవచ్చు. అసలే కోతి…ఆపై కల్లు తాగింది…అది కూడా చాలదన్నట్లు నిప్పు తొక్కింది అన్నట్లు…ఆడవాళ్లు తరువాత మీకులో “మీ” అని చదవాలో, “మ” అని చదవాలో తెలియకుండా విచిత్రమయిన లిపిని కనుగొన్నారు. బహుశా తెలుగు సినిమా వారిది ప్రత్యేక లిపి ఏదయినా ఉంటే…నా అజ్ఞానం క్షమింపబడుగాక! సంబోధన సూచకం ! ఎక్కడ ఉండాలో? ఎక్కడ ఉండకూడదో? జోహార్లు చెబుతున్న ఈ మగ పుంగవులకు కనీసం జోహార్లు అందుకోవాల్సిన ఆ ఆడవారయినా చెబితే…వారికి జోహార్లు చెప్పాలి.

హే సిరామికా!

ఈరోజుల్లో ఫ్లోరింగ్ కు, బాత్ రూమ్ గోడలకు సిరామిక్ టైల్స్ తప్పనిసరి. అలాంటి సిరామిక్ టైల్స్ కథ ఆధారంగా నిర్మితమయిన సినిమాలో హీరో ఇన్ పేరు సార్థకనామధేయంగా “సిరామిక” అయి ఉండి…ఆమెను పిలిచేప్పుడు హే! సిరామికా! అయి ఉంటుందని… అది అచ్చు తప్పుగా ” హే! సినామిక” అయి ఉంటుందని మనసు పరి పరి విధాల తెలుగు కీడును శంకించింది. తీరా ఆరా తీస్తే అది- “హే! సినామిక” అట. నాకున్న కొద్దిపాటి భాషాజ్ఞానం ఈ “సినామిక”కు అర్థం కనుక్కోలేకపోతోంది. నాదగ్గరున్న తెలుగు, సంస్కృతం నిఘంటువులు కూడా అర్థం చెప్పలేక చేతులెత్తేశాయి. సినామిక అంటే సరికొత్త అని గూగుల్ చెబుతున్న మాట మీద నాకు గురి కుదరడం లేదు.

ఖతర్నాక్ టైటిల్!

‘రామారావు ఆన్ డ్యూటీ’ అని ఇంకో ముచ్చటయిన సినిమా టైటిల్.  కలెక్టర్ ఖతర్నాక్  అనేది ఈ సినిమా ప్రచారానికి తగిన ట్యాగ్ లైన్. అధికారి ఖతర్నాక్  అయినప్పుడు విశేషణ పూర్వపదం ఖర్మ బలంగా కాలి…బూడిదయి…ఖతర్నాక్ కలెక్టర్  కావడాన్ని వ్యాకరణం కూడా అంగీకరించింది!

Cinema Titles

తెలుగుతో ఇంగ్లీషు ఢీ
తెలుగు సినిమా టైటిల్స్ ను తెలుగు లిపిలో రాస్తే జైల్లో పెట్టి…విచారణ లేకుండానే ఉరి తీస్తారనే భయంవల్ల జనించిన జ్ఞానంతో ఈమధ్య ఇంగ్లీషు లిపిలో రాస్తున్నారు. “పెళ్లిసందడి” అన్న సినిమాను “పెళ్లిసందD” అని పెట్టారు. పేరులో వర్ణ సంకరం వంకరకు తగినట్లు సినిమా తనతో తానే ఢీకొట్టుకుని డీలాపడి డిగులు డిగులుగా తల డించుకుని డింకీలు కొట్టినట్లుంది!

తెలుగు సినిమాది దానికిదిగా ఒక భాష. దానిది ఒక ప్రత్యేకమయిన లిపిలేని భాష. లిపిలేనప్పుడు ఏదో ఒక లిపిలో, ఎలా అఘోరించినా…అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది!

హే! సినామికా!
చచ్చి నీ కడుపున పుడతాం.
మాక్కొంచెం నీ భాష నేర్పిస్తావా?

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి : శివతాండవానికి తెలుగు మువ్వలు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్