ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల మధ్యసరిహద్దు ఘర్షణలు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. కేంద్రం నిర్లిప్త వైఖరి… పార్టీల ఓట్ల రాజకీయాలతో ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. తాజాగా అస్సాం, మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం చెలరేగిన హింస బుధవారం కూడా కొనసాగింది. అస్సాంలోని ఆంగ్లాంగ్ జిల్లాలో ఉన్న అటవీ కార్యాలయంపై మేఘాలయ వాసులు దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఇదే సమయంలో మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఒక వాహనానికి, ముక్రోహ్‌లో మరో వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు.
వీరు అస్సాంకు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరు రాష్ర్టాల మధ్య ఉన్న 12 వివాదాస్పద ప్రాంతాలపై ఇరువురికి తరుచుగా గొడవులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల 6 ప్రాంతాలపై ఇరు రాష్ర్టాల సీఎంలు ఒప్పందం చేసుకున్నారు. మిగతా 6 ప్రాంతాలపై ఒప్పందానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు సరిహద్దులో స్థానికుల మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయని, అది పెద్ద విషయం కాదని అస్సాం సీఎం హిమంత బిశ్వాస్ చెప్పారు.