పాక్ ఆక్రమిత కశ్మీర్లో లష్కర్ ఎ తోయిబా, జైష్ ఎ మహ్మద్ తదితర సంస్థల ఉగ్రవాదుల కదలికలు మళ్ళీ మొదలయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల తరపున పోరాడేందుకు వెళ్ళిన ముష్కరులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని వివిధ నగరాల్లో ఈ రోజు ర్యాలీలు నిర్వహించారు. అబ్బాస్పూర్, హాజిరా, సేంస తదితర ప్రాంతాల్లో వాహనాలపై జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. టెర్రరిస్టులు విచ్చలవిడిగా తిరిగిన ఈ ప్రాంతాలు భారత సరిహద్దులకు సమీప ప్రాంతాలు కావటం గమనార్హం.
మారుమూల ప్రాంతాల్లోని పట్టణాల్లో ప్రభుత్వంతో సంభందం లేకుండా ఉగ్రవాదులు చెక్ పోస్టులు పెట్టి అందరిని గుర్తింపు పత్రాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చినవారిని తామే వెంట తీసుకెళ్తున్నారు. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో భయానక వాతావరణం నెలకొంది. రాజధాని ముజఫరాబాద్ సహా వివిధ నగరాలకు నిన్న భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఆఫ్ఘన్ నుంచి చేరుకున్నారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉగ్రవాదుల ర్యాలీ వీడియోలు వైరల్ అయ్యాయి. ముష్కర మూకల సభ్యులు, సానుభూతిపరులు ర్యాలీగా వెళుతుంటే చేష్టలుడిగి చూడటం పోలీసుల వంతైంది.
ఆఫ్ఘన్ ఆక్రమణలో తాలిబన్లు విజయం సాధించటంతో లష్కర్ ఎ తోయిబా, జైష్ ఎ మహ్మద్ సంస్థలు సంబరంగా ఉన్నాయి. ఈ రెండు సంస్థలు జమ్మూ కాశ్మీర్ లోకి చొరబాట్లు చేయటం, స్థానిక యువతను రెచ్చగొట్టి భారత సైన్యంపై దాడులకు వాడుకుంటున్నాయి. ఇండియాలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, అల్లర్లకు కారణమైన లష్కర్ ఎ తోయిబా, జైష్ ఎ మహ్మద్ మళ్ళీ జూలు విదల్చనున్నాయని భారత నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పటికే అప్రమత్తం చేశాయి. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐ.ఎస్.ఐ) సహకారంతో లష్కర్ ఎ తోయిబా, జైష్ ఎ మహ్మద్ ఉగ్ర సంస్థలు పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.