దేశీయ మార్కెట్లోకి టెస్లా వాహనాల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి కృషి చేస్తున్నామని అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ టెస్లా తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. టెస్లా వ్యవస్థాపకుడు, సీఈవో ఎలన్ మస్క్‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. హేయ్ ఎలన్.. నేను ఇండియాలోని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కేటీఆర్‌ను. టెస్లా కార్యకలాపాల్లో భారత్ కానీ, తెలంగాణ కానీ భాగస్వామ్యమయితే చాలా సంతోషిస్తానని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక, అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిందన్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా ఉందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ టెస్లా మోడల్ X కారు ఫోటోలను షేర్ చేస్తూ పాత ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కేటీఆర్ ఆ కారును నడిపిన దృశ్యాలను కేటీఆర్ షేర్ చేశారు.
భారత్‌లో టెస్లా ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టే అంశమై ఒక ఫాలోవర్ ట్వీట్‌కు టెస్లా వ్యవస్థాపకుడు, సీఈవో ఎలన్ మస్క్ స్పందిస్తూ ‘ప్రభుత్వంతో ఎదురైన ఎన్నో సవాళ్లను ఇంకా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం’ అని రీట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై సుంకాలు తగ్గించాలంటూ గతేడాది కేంద్రానికి టెస్లా విజ్ఞప్తి చేసింది. పన్ను రాయితీలను పరిశీలించాలంటే దేశంలో తొలుత వాహనాల తయారీని ప్రారంభించాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ టెస్లాకు స్పష్టంచేసింది. కేవలం దిగుమతుల కోసం ఏ ఆటోమొబైల్ కంపెనీకి తాము రాయితీలివ్వడం లేదని, టెస్లాకు ఇస్తే..దేశంలో ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడి చేసిన ఇతర కంపెనీలకు ప్రతికూల సంకేతం పంపినట్టు అవుతుందని గురువారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దిగుమతవుతున్న కార్లకు వాటి ఇంజిన్ పరిమాణం, ధర, రవాణ, బీమా వ్య యాల ఆధారంగా 60 నుంచి 100 శాతం వరకూ సుంకం విధిస్తున్నారు. సర్‌ఛార్జ్‌తో కలుపుకొని సుం కం 110 శాతం మేర పడుతున్నదని, ఎలక్ట్రిక్ వాహనాలకు దీనిని 40 శాతానికి తగ్గించాలని టెస్లా…ప్రభుత్వాన్ని కోరుతున్నది. సేల్స్, సర్వీస్, ఛార్జింగ్ సదుపాయాల కోసం ఇండియాలో గణనీయంగా పెట్టుబడులు చేస్తామని చెప్తున్నది. దేశంలోకి ప్రవేశించే ఉద్దేశంతో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో బెంగళూరులో ఒక సంస్థను అమెరికా కంపెనీ గతేడాది రిజిష్టర్ చేసింది.
Also Read : బీజేపీ సీఎంలకు సంస్కారం లేదు – TRS