Saturday, November 23, 2024
HomeTrending NewsGold Mine: పెరూలో ఘోర ప్రమాదం... 27 మంది మృతి

Gold Mine: పెరూలో ఘోర ప్రమాదం… 27 మంది మృతి

దక్షిణ అమెరికాలోని ఓ గోల్డ్‌మైన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 27 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పెరూకు దక్షిణంగా ఉన్న అరేక్విపా ప్రాంతంలో ఉన్న లా ఎస్సెరాంజా-1  గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సొరంగంలో భారీగా మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో గనిలో 175 మంది కార్మికులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు 27 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మిగిలిన కార్మికులను వెంటనే అక్కడి నుంచి తరలించినట్లు చెప్పారు.

‘గనిలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ మంటలు గనిలోని చెక్క బ్లాకుల ద్వారా వ్యాపించాయి. ఆ సమయంలో కార్మికులు భూమికి 100 మీటర్ల లోతులో ఉన్నారు. మంటలు భారీగా ఎగసిపడటంతో దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో ఊపిరాడక 27 మంది కార్మికులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు’ అని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గనిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు పెరూలో ఉన్నాయి. బంగారం ఉత్పత్తిలో పెరూ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఏటా 100 టన్నులకుపైగా బంగారాన్ని ఆ దేశంలో వెలికితీస్తుంటుంది. అంతేకాదు రెండో అతిపెద్ద రాగి ఉత్పత్తి దేశంగా కూడా పెరూ నిలిచింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్