యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా 43 పరుగులతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్ లో 2-0 ఆధిక్యం సంపాదించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 155 పరుగులతో సత్తా చాటి ఒక దశలో ఇంగ్లాండ్ కు విజయావకాశాలు మెరుగు పరిచినా టీ విరామం తర్వాత అతడు ఔట్ కావడంతో ఆసీస్ పైచేయి సాధించి విజయం సొంతం చేసుకుంది.
విజయానికి 371 లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ నిన్న నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
విజయానికి నేడు 257 పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతంగా రాణించి జట్టును విజయ తీరాలవైపు తీసుకెళ్ళాడు. నిన్న 50 పరుగులతో క్రీజులో ఉన్న బెన్ డకేట్ 83 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. బెయిర్ స్టో 10 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ దశలో స్టోక్స్… స్టువార్ట్ బ్రాడ్ తో కలిసి ఏడో వికెట్ కు 108 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. చివరకు 327 రన్స్ కు ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది.
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్. కమ్మిన్స్, హాజెల్ వుడ్ తలా 3; గ్రీన్ 1 వికెట్ పడగొట్టారు.
స్టీవెన్ స్మిత్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.