Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

వికారాబాద్ ను అనంతగిరి జిల్లాగా పేరు మార్చుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం రాగానే అనంతగిరి జిల్లాగా ప్రకటిస్తామన్నారు. 8వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్ సమీపంలోని శివారెడ్డిపేటలో కొద్దిసేపటి క్రితం రైతులతో రచ్చబండ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. తొలుత రైతులు మాట్లాడుతూ వారి సమస్యలను విన్నవించుకున్నారు. ఆ తర్వాత వికారాబాద్ లో జరిగిన బహిరంగసభలో బండి సంజయ్ ప్రసంగించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రసంగం ఆయన మాటల్లోనే….

నిన్న మన్నెగూడలోనే కేసీఆర్ గురించి చెప్పిన. వెంటబడితే పీఎం కేసీఆర్ కు అపాయిట్ మెంట్ ఇచ్చిండు మోడీ.
బీజేపీ, టీఆర్ఎస్ ఒకటైతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ గెలుస్తది. దుబ్బాకలో ఎందుకు గెలిచినం. బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా టీఆర్ఎస్ లోకి పోయిండ్రు. టీఆర్ఎస్ గడీలను, ఎంఐఎం గడీలను బద్దలు కొట్టి తరిమితరిమి కొట్టే పార్టీ ఏది? బీజేపీ కదా….మరి టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి ఎట్లయితది? గతంలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, కమ్యూనిస్టులు కూడా కలిసి పోటీ చేసినయ్.
కేసీఆర్ ఎంగిలి మెతుకులు తినే నాయకులు కొందరు ఇక్కడున్నరు.

ఓ తాత వచ్చి వికారాబాద్ కు ఉఫ ఎన్నిక వస్తదా? అని అడుగుతుండ్రు. ఉపఎన్నిక వస్తే దళిత బంధు వస్తదని అనుకుంటున్నరు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ బయటకు వస్తడు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. పోయే సీఎంకు పథకాలు ఎక్కువ. ప్రధాని వద్దకు వంగి, వంగి దండాలు పెట్టిన కేసీఆర్ …ఈసారి కోతలు కోస్తే విడిచి పెట్టే ప్రసక్తే లేదు. మోదీగారిని 50 నిమిషాలు కలిసిండని చెబుతుండు. కానీ అంత సమయం ఇస్తడా? సరే…కలిసినవ్. రాష్ట్రంలో నువ్వెందుకు లీడర్లను కలవవు?
ప్రధానిని కలిసి చాలా అడిగినవ్ కదా….మరి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు….టాయిలెట్లసహా అన్ని పథకాలకు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పినవా? ఇఛ్చిన నిధులను దారి మళ్లించి దోచుకున్న నీచుడు కేసీఆర్. రోడ్లు, మొక్కలు, రైతు వేదికలు, ఉచిత బియ్యం, ఫ్రీ వ్యాక్సిన్ సహా చివరకు స్మశానవాటికలకూ డబ్బులు కేంద్రం ఇఛ్చినవే.
అప్పా జంక్షన్ నుండి రాయచూర్ కు వెళ్లాలంటే ఐదారు గంటలు పడుతోంది. ల్యాండ్ సేకరించి ఇస్తే ఇప్పటికే హైవే అయ్యేది. కానీ ఇవేమీ చేయకుండా కేంద్రంపై విమర్శలు చేస్తుండ్రు.
ప్రతి పైసా కేంద్రమిస్తే…..టీఆర్ఎస్ పథకాలుగా చిత్రీకరిస్తున్నరు. ప్రజల సమస్యలు తెలుసుకుని…ఈ విషయాలు ప్రజలతో పంచుకోవడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం.
ఇవాళ సబ్సిడీలు ఎత్తేసిండు. యూరియా ఫ్రీ అన్నడు. ఎత్తేసిండు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతున్నడు.
తాండూర్ అంటే…షాబాద్ బండలకు ఫేమస్ కానీ ఈ సీఎం ఇక్కడి కార్మికులను ఆదుకోవడం లేదు. ఎందుకంటే సీఎం కుటుంబమంతా గ్రానైట్ పేరిట దోపిడీ చేస్తుండు. అనంతగిరి జిల్లాను టూరిజం ప్లేస్ చేస్తానన్నడు. ఊటీ చేస్తానని చెప్పి లూటీ చేసిండు. వీటిపై పోరాడేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం.


తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించాల్సిందే. బీజేపీ పక్కా అధికారంలోకి వస్తదనే నమ్మకాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ గారు ధీమా వ్యక్తం చేసిండు. గతంలో ఆయన మహారాష్ట్ర సీఎంగా పనిచేసిండు. ఒకేసారి ఏడాదిలోపు 70 వేల ఇండ్లను నిర్మించి ఒకేసారి గృహ ప్రవేశం చేయించిన ఘనత ఫడ్నవీస్ దే. కానీ సీఎం కేసీఆర్ కేంద్రం నుండి ప్రధాని ఆవాస్ యోజన కింద రూ.1500 కోట్లు తెచ్చుకుని ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా నిదులు దారి మళ్లించిండు.
ఢిల్లీకి పోయి కత్తి తిప్పుతానని చెప్పి ఫాంహౌజ్ లోకి పోయి పడుకుండు. వరంగల్ జైలును తరలించి ఖైదీలను నానా ఇబ్బంది పెడుతుండు.
ఉద్యోగాల్లేక యువత ఇబ్బంది పడుతున్నరు. స్కూళ్లు లేవు. కాలేజీల్లేవు. కానీ గల్లీకొక బార్ మాత్రం పెట్టి దోచుకుండు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా వాళ్లకు సంతోషం లేకుండా పోయిందని ఆ పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నరు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేది కాషాయజెండానే. బీజేపీ ఇస్లాంకు వ్యతిరేకం కాదు. క్రైస్తవాన్ని కించపర్చలేదు.
ముస్లింలు ఆలోచించాలి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగే ఓవైసీ పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు రావడం లేదు? యువకులకు పాస్ పోర్టులు ఎందుకు రావడం లేదు? కొత్త సంస్థలు ఎందుకు రావడం లేదో ఆలోచించాలి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా అడ్డుకుని తీరతం.

1400 మంది అమరుల త్యాగాలపై, రక్తపు మడుగులపై ఓ కుటుంబం రాజ్యమేలుతోంది. తెలంగాణ తల్లి ఫాంహౌజ్ లో బందీ అయ్యింది. తెలంగాణ తల్లి తల్లడిల్లుతోంది. అందరం కలిసి ఆ తల్లిని బంధ విముక్తిరాలిని చేసేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com