పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగాయి. రెండు రోజుల కిందట ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం లీటరు ఇంధనంపై దాదాపు రూ.20 వరకు పెంచింది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ. 290కి పెరుగగా, డీజిల్ (హైస్పీడ్) ధర రూ. 293కి చేరింది. పెట్రో ధరలు పెరగటంతో అన్ని రకాల నిత్యావసరాల రెట్లు ఆకాశాన్ని అంటాయి.
మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయనగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం… అన్ని రాజకీయ పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే పాక్ రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలవటం మీద పెట్టిన శ్రద్ధ… ధరల తగ్గింపుపై చూపటం లేదు. సామాన్య ప్రజలు కూడా రాజకీయ పార్టీలను నమ్మటం లేదు. ఏ పార్టీ గెలిచినా ఒరిగేదేమీ లేదని వాపోతున్నారు.
మరోవైపు మతోన్మాదులు దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఐదు చర్చిలపై దాడి జరిగింది. ఇస్లాం మత గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 100 మంది కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. చర్చిలను ధ్వంసం చేసి వస్తువులను తగులబెట్టారు. ఓ బిషప్ మాట్లాడుతూ దాడి సందర్భంగా బైబిళ్లను అపవిత్రం చేశారని, క్రైస్తవులను హింసించారని చెప్పారు.