పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర లక్షలాది భక్తుల హరి బోల్, జై జగన్నాథ్ జయజయ ధ్వానాల మధ్య నయనానందకరంగా సాగింది. ఈ వార్షిక రథయాత్రకోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. కృష్ణావతారం ముగించిన తరువాత జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణుడు పూరీ క్షేత్రంలో దారు బ్రహ్మగా స్థిరపడ్డాడు. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలన్నింటిలో ప్రత్యేకమైనది రథయాత్ర.

జగన్నాధుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడుతో ఊరేగింపుగా గుండీచా మందిరానికి వెళ్ళడమే రథయాత్ర….ఇందులో జగన్నాథుడు కొలువుండే రథం పేరు “నందిఘోష”.ఇది 45.6 అడుగుల ఎత్తుతో, 18 చక్రాలు కలిగిన రథం. బలభద్రుడి రథం 45 అడుగులు ఎత్తు ఉండి 16 చక్రాలతో అలరారుతుంది..దీనిపేరు తాళధ్వజ..ఇక సుభద్రా దేవి ఊరేగే రథం పేరు దేవదళన…ఇది 44.6 అడుగుల ఎత్తు ఉండి 14 చక్రాలతో ఉంటుంది. మూడు రథాల తయారీకి 884 చెట్లను వాడతారు. పూజారులు అడవికి వెళ్లి రథాన్ని నడిపేందుకు ఉపయోగించే చెట్లకు పూజలు చేస్తారు. పూజ అనంతరం బంగారు గొడ్డలితో చెట్లను నరికేస్తారు. ఈ గొడ్డలి మొదట జగన్నాథుని విగ్రహాన్ని తాకేలా తయారు చేస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత కాగా ఉత్సవానికి కొన్ని నెలల ముందే రంగురంగుల వస్త్రాలతో చాలా ఆకర్షణీయంగా అలంకరిస్తారు. ఈ యాత్ర ఆషాఢ శుధ్ధ విదియనాడు మొదలవుతుంది. గుండిచా ఆలయానికి ఊరేగింపుగా వెళ్ళిన ఈ దేవతలు, ఏడు రోజులు అక్కడ గడిపి మళ్ళి దేవాలయనికి తిరిగివస్తారు. నిన్న జూన్ 28న మొదలైన జగన్నాధ రథయాత్రలో 12 లక్షల మంది భక్తులు స్వయంగా పాల్గొన్నారు.

జగన్నాథుని రథయాత్ర మేళ తాళాలతో బయలుదేరే సమయంలో పూరి చుట్టుపక్కల ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. రథయాత్ర కోసం అక్షయ తృతీయ రోజు నుంచే రథం తయారు చేసే పనులు ప్రారంభమవుతాయి. రథాల తయారీకి కొత్త వేప, కలప చెట్లను ఉపయోగిస్తారు.

గుండిచాను జగన్నాథుని పెంచిన తల్లిగా కొలుస్తారు. గుండిచా ఆలయంలో జగన్నాథుని దర్శనాన్ని ఆడప్ దర్శనం అంటారు. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రా దేవి విగ్రహాలను విశ్వకర్మ ఇక్కడ నిర్మించాడని చెబుతారు. రథయాత్రలో కుల వివక్ష అనేదే ఉండదు. రథయాత్ర ముగింపు సందర్భంగా విగ్రహాలన్నీ జగన్నాథ ఆలయానికి చేరుకునే వరకూ రథంలోనే ఉంటాయి. ఆషాఢ మాసం దశమి రోజున రథాలు ఆలయానికి బయలుదేరతాయి. ఈ తిరుగు ప్రయాణాన్ని ‘బాహుడా యాత్ర’ అంటారు. ఏకాదశి రోజు ఆలయ తలుపులు మూసేస్తారు. తదనంతరం స్నానం చేయించిన తర్వాత తిరిగి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. మొత్తం 9 రోజులపాటు సాగే పూరీ జగన్నాథ రథయాత్ర ప్రతియేటా సరికొత్త శోభను సంతరించుకుంటూ భక్తులను పరవశింపజేస్తోంది.

