Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబి వి పట్టాభిరామ్ కన్నుమూత

బి వి పట్టాభిరామ్ కన్నుమూత

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బివి పట్టాభిరామ్ మృతి చెందారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. తెలుగునాట నాలుగున్నర దశాబ్దాలుగా లక్షలాది మందికి ఆయన తన సలహాలు, సూచనల ద్వారా ప్రేరణ కలిగించారు. వ్యక్తిత్వ వికాసం, ఒత్తిడిని అధిగమించడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఎలా అనే దానిపై మార్గదర్శనం చేశారు. ఆయన రచించిన “కష్టపడి పనిచేయొద్దు-ఇష్టపడి పనిచేయండి” పుస్తకం విశేష పాఠకాదరణ పొందింది. నిరాశ, ఒత్తిడి.. జూదం, మత్తు పదార్ధాలకు బానిసలై మృత్యువు అంచులకు వెళ్ళిన ఎందరికో ఆయన పునర్జన్మ ఇచ్చారు. తన మాటలతో లక్షలాది మందిలో స్ఫూర్తి నింపిన పట్టాభిరామ్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

బివి పట్టాభిరామ్ కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా, పేరుగాంచిన ఇంద్రజాలికుడిగా, మానసిక నిపుణుడిగా కూడా తెలుగు ప్రజలకు సుపరిచితులు. అనేక పుస్తకాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వేలాది ప్రసంగాల ద్వారా ఆయన సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేశారు. క్లిష్టమైన మానసిక శాస్త్ర అంశాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా సులభమైన శైలిలో వివరించడం ఆయన ప్రత్యేకత. బి.వి.పట్టాభిరాం పూర్తి పేరు భావరాజు వేంకట పట్టాభిరాం . తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో రచనలు చేశారు. విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడంతో పాటు, తల్లిదండ్రులకు అవగాహనా సదస్సులు నిర్వహించారు. దూరదర్శన్ లో అనేక మేజిక్ షోలు  చేసి అలరించారు.

1990లలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో బాలలకు బంగారుబాట అనే శీర్షికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవితచరిత్రల గురించి;  బాలజ్యోతి అనే బాలల పత్రికలో “మాయావిజ్ఞానం” పేరిట వ్యాసాలు రాశారు. బి.వి.పట్టాభిరాం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా పొందిన తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో స్నాతకోత్తర పట్టా అందుకున్నాడు. గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికానుండి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న పట్టాభిరామ్ ..  ఒత్తిడిని జయించడం, వ్యక్తుల మధ్య సంబంధాలు, అసర్టివ్ నెస్, సెల్ఫ్ హిప్నాటిజం మొదలైన అంశాలపై భారతదేశంలోని అనేక ప్రాంతాలతో పాటు , అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్‌షాపులు నిర్వహించారు హిప్నోసిస్ పై ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. నాష్‌విల్ల్, న్యూ ఆర్లియన్స్ నగర మేయర్లు ప‌ట్టాభికి గౌరవ పౌరసత్వంకూడా ప్రదా నం చేశారు. చాణక్యతంత్రం, ..మాజిక్ ఆఫ్ మహాత్మా.. ఒత్తిడి కూడా వరమే..వైజ్ఞానిక హిప్నాటిజం..సర్దుకుపోదాం రండి..కాలేజ్‌ క్యాంపస్ ఇలా ఎన్నో ర‌చ‌న‌లు చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పట్టాభిరామ్ మృతితో తెలుగు నెల ఓ  గొప్ప స్పూర్తి స్పూర్తి ప్రదాతను కోల్పోయింది.

– కనక మహాలక్షి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular