గతంలో మహిళలు మిడిల్ ఏజ్ లో చిరాకుగా, భారంగా ఒక్కోసారి స్తబ్దుగా కనిపించేవారు. ఒకరకమైన నిరాశలో ఉండేవారు. ఇటీవలి కాలంలో మహిళలు స్నేహితులతో కలసి టూర్లకు వెళ్లడం, చిన్న చిన్న పార్టీలు చేసుకోవడం చూస్తున్నాం. ముఖ్యంగా ఇంటి బాధ్యతలు తీరి వారికంటూ కాస్త సమయం దొరుకుతోంది. దాంతో పాత స్నేహితులను కలుసుకోవడం, అందరూ కలసి టూర్స్ వెళ్లడం ట్రెండ్ అయింది. అలాగే సౌందర్య పోషణ, ఆరోగ్య స్పృహ కూడా పెరిగింది. ఇంట్లో వారు ఏమన్నా పెద్ద పట్టించుకోకుండా తమ ఇష్టాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచిదే, అయితే వయసు పెరిగేకొద్దీ మహిళలు తమ స్త్రీత్వాన్ని కోల్పోతారని, అది తెలుసుకోకుండా ఎంత తయారైనా లాభం లేదని కొందరు అంటూ ఉంటారు. వారి అందం, ఆకర్షణ తగ్గుతూ వస్తాయని, అందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తూ అందం కాపాడుకోవాలని పరితపిస్తూ ఉంటారట. ఇటీవల హఠాత్తుగా గుండె పోటుకు గురై మరణించిన నటి షెఫాలీ జరీవాలా కూడా అటువంటి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ వల్లే సమస్యలు ఎదుర్కొందని కథనాలు వస్తున్నాయి. నటి శ్రీదేవి కూడా ఈ తాపత్రయం తోనే ఆరోగ్యం చెడగొట్టుకుందని అంటారు. అసలు వయసుని బట్టి మహిళలు అందం, ఆకర్షణ, సహజమైన సున్నితత్వం కోల్పోతారా అంటే కాదనే చెప్పాలి. అదంతా పోటీ ప్రపంచాల్లో నెగ్గుకు రావడం కోసం పడే తాపత్రయమే గానీ మరొకటి కాదు.

వాస్తవంలో వయసు పెరిగేకొద్దీ మహిళల్లో సహనశక్తి తగ్గిపోతుంది. అదీ ఒకదానిపట్ల అని చెప్పలేం. చుట్టూ ఉన్న మనుషులు, వస్తువులు .. అన్నిటిమీదా అసహనం పెరుగుతుంది. కారణం .. ఆమె ఏళ్ళ తరబడి వినీ వినీ అలసిపోయింది. కుటుంబానికి అన్నీ అమర్చిపెట్టి, వారిని తీర్చిదిద్ది రెక్కలు విప్పి ఎగిరేలా కష్టపడి కూలబడింది. ఎన్నో చూసింది. ఆటుపోట్లు తట్టుకుంది. అంతా చేశాక ఆమెలో ఏమిటీ మార్పు?
వయసు పెరిగేకొద్దీ తనకు తాను తప్ప ఎవరూ లేరని ఆమెకు అర్థం అవుతుంది. ఉత్సాహపరచాలన్నా, శక్తి కావాలన్నా ఎవరో రారు. తననుంచే రావాలి అని అర్థమవుతుంది. జీవిత భాగస్వామిగా ఉన్న భర్త తనకు నచ్చిందే చూసి, నచ్చిందే విని, నచ్చిన చోటుకే వెళ్ళలంటాడు. ఇన్నాళ్లుగా దానికి అలవాటు పడిందామె.
కానీ ఇప్పుడలా కాదు. తన ఇష్టాల గురించి ఆలోచిస్తోంది. తన ఆరోగ్యం, మిగిలిన కాస్తంత శక్తిసామర్ధ్యాలు కాపాడుకోవాలనుకుంటోంది. అలా అని అందరూ కూడా అలా ఉండటం లేదు. కొందరు మాత్రమే మధ్యవయసులో తమకోసం జీవించడం నేర్చుకుంటున్నారు. స్నేహితులతో యాత్రలు చేస్తున్నారు. కుటుంబాన్ని జీవితంలో భాగంగా మాత్రమే భావిస్తూ కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. అటువంటివారిని గమనించి చూడండి. వారి ముఖాల్లో కొత్తకాంతి ప్రకాశిస్తూ ఉంటుంది.

