అప్పట్లో ఆస్పత్రికి వెళ్తే మన జ్వరం ఎంతో చెక్ చేయడానికి ఒక థర్మా మీటర్ ను నోట్లో పెట్టి కాసేపు ఉంచి చూసేవారు. మరికొన్ని చోట్ల చంకల్లో పెట్టి చూసేవారు. కాలక్రమేణా డిజిటల్ థర్మామీటర్ లు వచ్చేశాయి. కొద్దిగా వొళ్ళు వెచ్చగా ఉంటే చాలు… చెక్ చేసి దాని ప్రకారం మందులు వాడడం, పిల్లలకు అయితే సిరప్ లు ఇవ్వడం చేస్తూ వస్తున్నాం. ఒకప్పుడు ఇంజక్షన్ చేయాలన్నా… ఒకే సూదిని చాలామందికి వాడేవారు. ఒకరికి చేసిన తరువాత దాన్ని మరుగుతున్న వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉంచి మళ్ళీ వాడేవారు, ఆ తర్వాత డిస్పోజబుల్ సిరంజీలు వచ్చాయి.
గతంలో పెద్దాసుపత్రుల్లోనే బిపి, షుగర్ చెకప్ పరికరాలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అవి కూడా చౌకగా లభ్యమవుతున్నాయి. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండే వస్తువుల్లో థర్మామీటర్, బీపీ, షుగర్ మిషన్లు చేరిపోయాయి. ఈ కాలంలో పలురకాల కొత్త వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. పరీక్షల అనంతరం వాటిని నిర్ధారించడానికి రోజుల తరబడి సమయం పడుతోంది. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లోనే బైటపడుతుంది, అప్పుడు ఎంత ఖరీదైన చికిత్స తీసుకున్నా ప్రాణాపాయం తప్పట్లేదు. అందులోనూ పరిమిత ఆస్పత్రుల్లోనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే వీలుంది. దీనితో చాలామంది పేషెంట్లు రోజుల తరబడి పరీక్షల కోసమే ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ బాధలు తొలగిపోనున్నాయి. నిమిషాల్లో హెచ్ ఐ వి, కాన్సర్ వ్యాధులను నిర్ధారించడానికి సరికొత్త పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.

అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) శాస్త్రవేత్తలు డిస్పోజబుల్ డిఎన్ఏ స్పెన్సర్ ను తయారు చేశారు. దీనితో వ్యాధిని ఖచ్చితత్వంతో కనుగొనే వీలుంది. వీటి ధర 50 రూపాయాలలోపే ఉండడం విశేషం.
వైద్య రంగంలో జరుగుతోన్న పరిశోధనలతో సామాన్య మానవాళికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందుబాటు ధరల్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం.

