Wednesday, June 17, 2026
HomeTrending NewsRabi Review: రైతాంగానికి సిఎం కెసిఆర్ భరోసా

Rabi Review: రైతాంగానికి సిఎం కెసిఆర్ భరోసా

అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్నికూడా సేకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు. మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని సిఎం స్పష్టం చేశారు. గతానికి భిన్నంగా అకాల వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే జరిగే విధంగా ఎటువంటి విధానాలను అవలంబించాలో అధ్యయనం చేయాలని, ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని, సిఎం కేసిఆర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు.
వర్షాలు కొనసాగుతున్ననేపథ్యంలో వరికోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని రైతులకు సిఎం కేసీఆర్ సూచించారు.
మంగళవారం డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో … రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోల్లు జరుగుతున్న తీరు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరిధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా చర్యలు, ఇందుకు వ్యవసాయశాఖ అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సిఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…. ప్రకృతి వైపరీత్యానికి ఎవరం ఏమీ చేయలేం. అయినా మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించలేదు. వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10 వేల రూపాయలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటున్నది. ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. యాసంగి వరి ధాన్యం తడుస్తున్ననేపథ్యంలో..రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటున్నది. ఆపత్కాలంలో వారి దు:ఖాన్ని, కష్టాన్ని పంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తడిసిన వరి ధాన్యాన్ని కూడా సేకరించాలని నిర్ణయించింది. వీలయినంత త్వరగా ధాన్య సేకరణ పూర్తి చేస్తాం. రైతన్నలు ఏమాత్రం ఆందోళన చెందవద్దు ’’ అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అకాల వానలనుంచి తప్పించుకోవటం ఇటు నూకలు కాకుండా వుండాలంటే మార్చి నెలాఖరుకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కోతకొచ్చేలా ముందస్తుగానే నాట్లు వేస్తుకోవాలని రైతాంగానికి సిఎం సూచించారు.
ఈ దిశగా మరింత శాస్త్రీయ అధ్యయనం చేసి రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యపరచాలని వ్యవసాయ శాఖను సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఫర్టిలైజర్స్ వాడే విషయంలో కూడా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు తదితర సందర్భాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులను ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, అడ్వర్ టైజ్ మెంట్లు తదితర ప్రచార మార్గాల ద్వారా అవగాహనను, చైతన్యాన్ని కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖలోని కిందిస్థాయి ఏ.ఈ.వో లను, అధికారులను ఈ దిశగా అప్రమత్తం చేయాలని, వారు నిరంతరం రైతులకు అందుబాటులో వుంటూ ఎప్పటికప్పుడు తగు సూచనలందించాలని , ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును సిఎం ఆదేశించారు.
రాష్ట్రంలో నిర్మించిన రైతు వేదికలను వేదికగా చేసుకుని వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ దిశగా పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో.. మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి; ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సివిల్ సప్లైస్ కమిషనర్ వి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular