ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో రైతుల మృతి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఘటన స్థలాన్ని సందర్శించేందుకు ఈ రోజు ఉదయం బయలుదేరిన సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను లక్నోలో ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. అఖిలేష్ రోడ్డు మీదే బైటాయించారు. దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తేని ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాదితులను ఓదార్చేందుకు వెళ్ళిన బిఎస్పి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సతీష్ చంద్ర మిశ్రాను గృహనిర్భంధం చేయటం చట్ట విరుద్దమన్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రజాస్వామ్య విలువలు కాలరాసి, ఆటవిక పాలన సాగిస్తున్నారని అఖిలేష్ యాదవ్, మాయావతి మండిపడ్డారు.
రైతుల మరణానికి కారణమైన కేంద్రమంత్రి కుమారిడిని, ఆయన అనుచరవర్గాన్ని హత్యానేరం కింద అరెస్టు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయాట్ డిమాండ్ చేశారు. వారిపై హత్యానేరం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని రాకేశ్ తికాయాట్ కోరారు.
లఖీంపూర్ ఖేరి జిల్లా తికునియాలో ఆదివారం ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న కేంద్రమంత్రి అజయ మిశ్ర తేని కుమారుడు ఆశిష్ మిశ్ర తేని వాహన శ్రేణిని సంయుక్త కిసాన్ మోర్చా రైతులు అడ్డుకున్నారు. ఉపముఖ్యమంత్రి పర్యటన అడ్డుకోవాలని ముందే నిర్ణయించిన రైతులు హర్యానా, పంజాబ్ ల నుంచి పెద్ద సంఖ్యలో రాగా వారందరూ కేంద్ర మంత్రి కుమారుడిని కూడా అడ్డుకున్నారు. ఆశిష్ మిశ్ర తన వాహనాన్ని ఆపకుండా రైతుల పైకి తీసుకెళ్ళడంతో ఇద్దరు రైతులు అక్కడిక్కడే మృతి చెందారు. కోపోద్రిక్తులైన రైతులు ఆందోళనకు దిగటంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో నలుగురు మృతి చెందారు.
అయితే మొత్తం ఎనిమిది మంది చనిపోయారని జిల్లా పోలీసులు వెల్లడించారు. ఇద్దరు బిజెపి కార్యకర్తలు చనిపోయారని జిల్లా పోలీసులు ప్రకటించారు. దుర్ఘటన జరిగిన సమయంలో తన కుమారుడు లేడని కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర అంటున్నారు. ఆ సమయంలో లఖీంపూర్ ఖేరిలో ఉపముఖ్యమంత్రి కార్యక్రమం వద్ద ఉన్నాడని కొందరు రాజకీయంగా దెబ్బ తీసేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి అంటున్నారు.