పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్రపీడనంగా మారింది.ఈ రోజు (బుధవారం) వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని గోపాల్‌పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్ చెప్పారు. వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ విపత్తు ప్రభావం 30వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు ఉంటుందని, రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కడలి కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పొలాల్లో సెల్‌ఫోన్లు వాడొద్దని రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న సూచించారు. ఉరుములు, మెరుపుల బారిన పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కరెంట్ స్తంభాలు, చెట్ల కింద నిలబడొద్దని, పొలాల్లో ఉన్నప్పుడు నేలపై కూర్చోవాలని సూచించారు. ఎత్తుగా నిలబడి ప్రయాణం చేయవద్దని కోరారు.
భారీ వర్షాలతో స్వల్పంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం..భద్రాచలం వద్ద నీటిమట్టం 39.4 అడుగులు కాగా పోలవరం వద్ద 11.4 మీటర్లకు నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.84 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, డా.బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.