Saturday, November 23, 2024
HomeTrending NewsDiwali: ఫెడరల్‌ హాలీడేగా దీపావళి

Diwali: ఫెడరల్‌ హాలీడేగా దీపావళి

దీపావళి పండుగకు అగ్రరాజ్యం అమెరికాలో ఫెడరల్‌ హాలిడే ప్రకటించాలని కోరుతూ యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌ ఓ బిల్లును ప్రతిపాదించింది. ‘దివాళీ డే యాక్ట్’ పేరుతో రూపొందించిన బిల్లును డెమొక్రాటిక్ పార్టీకి చెందిన సభ్యురాలు గ్రేస్ మెంగ్‌ శుక్రవారం చట్టసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివాళీ డే యాక్ట్‌ను సభలో ప్రవేశపెడుతున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉందని అన్నారు. దీపావళి పండగ రోజును ఫెడరల్ హాలిడేగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ బిల్లు తొలుత పార్లమెంట్‌లో పాస్‌ కావాల్సి ఉంటుంది. అనంతరం అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది. ఈ బిల్లుపై చట్టసభ్యులు, అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ ప్రకటించారు. ఈ సంవత్సరం దీపావళి పండగను ఫెడరల్ హాలిడేగా జరుపుకొందామని అన్నారు. అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా దేశస్థులు అనుసరించే సంస్కతి, సంప్రదాయాలను గౌరవించుకున్నట్టవుతుందని వ్యాఖ్యానించారు.

ఈ బిల్లు చట్టసభలో ఆమోదం పొందితే అమెరికా ఫెడరల్‌ హాలిడేస్‌లో 12వదిగా నిలవనుంది. అమెరికాలో ప్రస్తుతం 11 ఫెడరల్‌ హాలీడేస్‌ మాత్రమే ఉన్నాయి. న్యూ ఇయర్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జయంతోత్సవాలు, ప్రెసిడెంట్స్‌ డే, మెమొరియల్‌ డే, జునెటెంత్‌ డే, ఇండిపెండెన్స్‌ డే, లేబర్‌ డే, కొలంబస్‌ డే, వెటరన్స్‌ డే, థాంక్స్‌ గివింగ్‌ డే, క్రిస్మస్‌ డే సందర్భంగా అమెరికా వ్యాప్తంగా అధికారికంగా సెలవు ఉంటుంది. ఇపుడు దీపావళికి ఫెడరల్‌ హాలీడేగా ప్రకటిస్తే 12వ ఫెడరల్‌ హాలీడేగా నిలవనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్