మెక్సికో సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) స్యాన్ జోస్ డెల్ కాబో సమీపంలో భూమి కంపించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని వెల్లడించింది. స్యాన్ జోస్ డెల్ కాబోకు 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నదని పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది.
Gulf of California: మెక్సికో సమీపంలో భూకంపం
అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల తీర ప్రాంతాల్లోని ఓడరేవుల్లో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూకంపం వల్ల సముద్ర నీటి మట్టాల్లో చిన్నపాటి వ్యత్యాసాలు గుర్తించవచ్చని మెక్సికో సివిల్ డిఫెన్స్ ఆఫీస్ పేర్కొంది. సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్ సునామీ హెచ్చరికల కేంద్రం చెప్పింది. కాగా, భూకంప తీవ్రత 6.3గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.