Saturday, July 6, 2024
HomeTrending NewsJack Ma: పాకిస్థాన్ లో జాక్ మా రహస్య పర్యటన

Jack Ma: పాకిస్థాన్ లో జాక్ మా రహస్య పర్యటన

ప్రముఖ బిలియనీర్‌, ఈ కామర్స్‌ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా తాజాగా పాకిస్థాన్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని పాక్ ఇంగ్లీష్ మీడియా సంస్థ ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. జాక్ మా పర్యటన గురించి బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ మాజీ చైర్మన్ మహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ చెప్పినట్లు ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. జూన్ 29న జాక్ మా పాకిస్థాన్ లాహోర్ కు చేరుకున్నట్లు తెలిపింది. 23 గంటల పాటు ఆయన అక్కడే బస చేసినట్లు పేర్కొంది.

ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఏవియేషన్ కు చెందిన ప్రైవేట్ జెట్ పీవీ-సీఎమ్ఏలో పాక్ కు చేరుకున్నట్లు చెప్పారు. అనంతరం 30వ తేదీన మా తిరిగి వెళ్లిపోయినట్లు సంస్థ తెలిపింది. జాక్ మాతో పాటు మరో ఏడుగురు వ్యాపార వేత్తలు కూడా ఈ పర్యటనలో పాలు పంచుకున్నారు. వారిలో ఐదుగురు చైనాకు చెందిన అధికారులు కాగా, ఒకరు డెన్మార్క్ కు చెందిన వారు, మరొకరు అమెరికా దేశస్తుడు. వీరంతా హాంకాంగ్ లోని కమర్షియల్ ఏవియేషన్ సెక్టార్ నుంచి చార్టెడ్ విమానంలో నేపాల్ కు వచ్చి.. అక్కడి నుంచి పాకిస్థాన్ చేరుకున్నారు.

జాక్ మా పాకిస్థాన్ లో 23 గంటలపాటు బస చేసినప్పటికీ అధికారులతో చర్చలు జరపలేదు. అదే సమయంలో మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. అతను ఓ ప్రైవేట్ ప్రాంతంలో బస చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకే అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని అహ్సన్ తెలిపినట్లు ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.

అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020 చివరిలో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ చైనా రెగ్యులేటరీ సిస్టంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత చైనా అధికారులు జాక్‌మాకు చెందిన కంపెనీలపై వరుసగా దాడులు చేశాయి. ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ప్రభుత్వ ఆగ్రహంతో అలీబాబా, యాంట్‌ గ్రూప్‌ తీవ్రంగా నష్టపోయాయి. అద‌న‌పు నిధుల సేక‌ర‌ణ ల‌క్ష్యంగా యాంట్ గ్రూప్ ప్ర‌తిపాదించిన ఐపీవోనూ చైనా నియంత్ర‌ణ సంస్థ‌లు అడ్డుకున్నాయి. ఈ ఐపీవో ద్వారా 37 బిలియ‌న్ డాల‌ర్ల నిధులు స‌మీక‌రించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు జాక్ మా.

చైనా స‌ర్కార్ క‌ఠిన వైఖ‌రి.. ప్ర‌భుత్వ పెద్ద‌ల చ‌ర్య‌ల‌తో 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాత జాక్‌ మా బయట ప్రపంచానికి కనిపించిన దాఖలాలు లేవు. జపాన్, ఆస్ట్రేలియా, థాయ్‍‍లాండ్‌ దేశాల్లో జాక్ మా అప్పుడప్పుడు కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి కూడా. అలా దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో ఉన్న జాక్ మా ఈ ఏడాది మార్చి నెలలో తిరిగి చైనాలో అడుగుపెట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్