కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎంతో బాధ కలిగించిందన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆక్సిజన్ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్ ను బుధవారం రాష్ట్ర రోడ్లుభవనాలు, గృహనిర్మాణ మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. మిత్రుల సహకారంతో రూ. కోటి ఖర్చుతో ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గంలో 102 ఆక్సిజన్ బెడ్లు, 14 ఐ సి యూ బెడ్లను ఏర్పాటు చేశారు.12 ప్రభుత్వ హాస్పిటల్స్ లో RO ప్లాంట్స్,రిసెప్షన్ ఏరియా మరియ ఇతర సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. దీంతో పాటు ఆర్మూర్, బోధన్ ఆసుపత్రుల్లో 10 ఐ సి యూ బెడ్లను ఏర్పాటు చేయిస్తున్నారు.
అధికారం శాశ్వతం కాదు
అధికారం ఎప్పటికి శాశ్వతం కాదు. పదవులు వస్తాయి, పోతాయి. కానీ పదవుల్లో వున్నప్పుడు ప్రజలకు ఎప్పటికి గుర్తుండిపోయే, అవసరమయ్యే పనులు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో ఆక్సిజన్ బెడ్ ఏర్పాటు చేయటమే కాకుండా 102 ఆక్సిజన్ సిలెండర్లను వారం రోజుల్లో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతామన్నారు.
రోజుకు 50 ఆక్సిజన్ సిలెండర్ లు నింపుకుని సమర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంతో మోర్తాడ్ నుండి నియోజకవర్గంలోని ఇతర హాస్పిటల్స్ కి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసే విధంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు సిద్ధమయ్యాయి.