ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలకు కొత్త నిర్వచనం చెప్పారు. తల్లిదండ్రులు యుక్తవయసులో ఉన్న అమ్మాయిలకు సెల్ ఫోన్ ఇవ్వటం వల్లే లైంగిక వేధింపులకు బలవుతున్నారని మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులకు సెల్ ఫోన్ సంభాషణ లే కారణమన్నారు.
ముందుగా అబ్బాయిలతో స్నేహంగా సెల్ ఫోన్ లో మాట్లాడి ఆ తర్వాత దూరంగా ఉండటం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. పనిలో పనిగా తల్లిదండ్రులకు కూడా మేడం హితోపదేశం చేశారు. సెల్ ఫోన్ లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించే కూతుళ్ళను వారి తల్లులే ఓ కంట కని పెట్టాలని హితవు పలికారు.
మహిళలపై అత్యాచారాలకు కారణం ఏంటని విలేఖరులు అడిగిన ప్రశ్నకు మహిళా కమిషన్ సభ్యురాలు ఈ విధంగా బాష్యం చెప్పారు. మహిళా సమస్యలపై అలిగడ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మీనా కుమారి ఈ వ్యాఖ్యలు చేయటం సంచలనం రేపాయి.
మీనా కుమారి కామెంట్స్ పై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించలేదు. అయితే మీనాకుమారి మాత్రం తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రోజువారీగా మహిళలకు సంబంధించి 20 ఫిర్యాదులు వస్తే అందులో ఆరు కేసులు సెల్ ఫోన్ స్నేహాలకు చెందినవన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిలకు సెల్ ఫోన్ ల గురించి అంతగా అవగాహన ఉండదని, స్నేహం పేరుతో అబ్బాయిలు సెల్ ఫోన్ లను ఎర వేసి అమాయక అమ్మాయిలను లోబర్చుకుంటారని మీనా కుమారి వివరణ ఇచ్చారు.