10.1 C
New York
Friday, December 1, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅదిగో లేపాక్షి-3

అదిగో లేపాక్షి-3

The Name: త్రేతాయుగం రామాయణ కథతో లేపాక్షి కథ కూడా మొదలవుతుంది. సీతమ్మను రావణుడు అపహరించుకుని ఆకాశమార్గాన తీసుకువెళుతుంటే జటాయువు అడ్డగించి…యుద్ధం చేస్తుంది. కోపగించిన రావణుడు పక్షికి రెక్కలే బలం కాబట్టి…ఆ రెక్కలను నరికేస్తే చచ్చి పడి ఉంటుందని…రెక్కలను కత్తిరిస్తాడు. జటాయువు రెక్కలు తెగి…రక్తమోడుతూ…నేల కూలుతుంది. సీతాన్వేషణలో భాగంగా చెట్టూ పుట్టా; కొండా కోనా; వాగూ వంకా వెతుకుతూ రామలక్ష్మణులు జటాయువు దగ్గరికి వస్తారు. సీతమ్మ జాడ చెప్పి…రాముడి ఒడిలో జటాయువు కన్ను మూస్తుంది. తమకు మహోపకారం చేసిన జటాయువు అంత్యక్రియలను రామలక్ష్మణులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంలో జటాయువును చూసిన వెను వెంటనే రాముడన్న మాట-
“లే! పక్షీ!”  అదే “లేపాక్షి” అయ్యింది.

తెలుగు భాష దాదాపు 1500 సంవత్సరాల క్రితం పుట్టింది అని ఒక లెక్క. ఇంకా ఉదారంగా అంచనా వేసినా…2000 సంవత్సరాల క్రితం పుట్టి ఉండాలి. ద్వాపర యుగానికి ముందు అంటే ఎంత కాదన్నా ఏడెనిమిది వేల సంవత్సరాలు, రాముడి పదకొండు వేల ఏళ్ల పాలన, లవకుశుల పద్నాలుగు వేల ఏళ్ల పాలన లెక్కల్లోకి తీసుకుంటే జటాయువును రాముడు కలిసింది కనీసం పాతిక వేల సంవత్సరాల క్రితం కావాలి. అప్పటికి- “లే పక్షీ! లేచి కూర్చో! నీళ్లు తాగు! నొప్పిగా ఉందా?” అని ఇప్పటి తెలుగులో అప్పటికి లేని భాషలో రాముడెలా మాట్లాడి ఉంటాడు? అని కొందరు పండితులు భాషా చరిత్ర, భాషా పరిణామ చర్చలతో తలలు బాదుకున్నారు. ఇప్పటికీ బాదుకుంటూనే ఉన్నారు.

పండితుల చర్చతో సామాన్యులకు పని లేదు. రాముడు జటాయువును కలిసి…లే!పక్షీ! అన్న చోటు లేపాక్షికి మూడు కిలోమీటర్ల దూరంలోని బింగిపల్లి దగ్గర ఉంది. అక్కడ రాతి మంటపం, చిన్న గుడి ఉన్నాయి. ఏడెనిమిది వందల ఏళ్ల క్రితమే దీని ఉనికిని గుర్తించినట్లు ఆధారాలు దొరికాయి.

1945- 75 ల మధ్య మైసూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన బాడాల రామయ్య “లేపాక్షి స్వప్న దర్శనం” పేరిట 1960 లో గొప్ప పద్యకావ్యం రాశారు. 1970లో ఈ పుస్తకం ప్రచురితమయ్యింది. అందులో రెండు పద్యాలివి…

“తర్కమే దశశీర్షుడై దారుణత్వ
మసురఖడ్గమై పక్షద్వయంబు ద్రుంప
పతనమౌ పక్షి నిచటనే పైకి లేపు
రామమూర్తి స్నేహామృత రసము గలదు”

లేనిపోని వాదనల తర్కాల పది తలల రాక్షసుడు ఎగిరే పక్షిని ఖడ్గంతో తుంచి కింద పడవేయగా రాముడు స్నేహామృత రసం చిలకరించి పక్షిని పైకి లేపిన చోటు ఇది.

“పక్షిం బోలె నధోగతింబడిన జీవవ్రాతమున్ లేప లే
పక్షీనామము దాల్తు మీరుషుల  సంపచ్చక్తి మీ కీయగా
ప్రక్షిప్తంబుగ మా యెద న్నడగె నాభారంబికన్ దీర మీ
యక్షయ్యంబగు శక్తులంద ప్రజలారా రండు రారండిటన్”

జటాయువు పక్షిలా పడి ఉన్న జీవుడిని లేపడానికి రాముడే కదిలి వచ్చిన చోటు ఇది. ఎంతో తపస్సు చేస్తే కానీ ఇలాంటి అవతార పురుషుడి స్పర్శ దొరకదు. అలాంటి పవిత్రమైన శక్తులను నింపుకోవడానికి లేపాక్షికి తరలిరండి.

ఈ కావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ ముందు మాట రాశారు.

“లే” అన్న మాట తెలుగు. “పక్షి” సంస్కృతం. రాముడికి తెలుగు తెలుసా? జటాయువు తెలుగులో మాట్లాడిందా? అప్పుడు తెలుగు ఉందా? అని ప్రశ్నలు, పరిప్రశ్నలు వేసుకోవడానికి బదులు- జటాయువుకు మోక్షమిచ్చిన రాముడు మహా చైతన్యస్వరూపుడు. ఆ చైతన్యంలో సర్వ భాషలున్నాయి. ఏ భక్తుడు ఏ భాషలో మాట్లాడినా…రాముడు అర్థం చేసుకున్నాడు. త్యాగయ్యతో తెలుగులోనే మాట్లాడాడు. రామదాసుతో తెలుగులోనే మాట్లాడాడు. పోతనచేత తెలుగులోనే భాగవతం రాయించాడు. కాబట్టి “లే! పక్షి!” అనే ఉంటాడు. ఒక గుడి మహోదాత్తమైన రాముడి లే పక్షి- పలకరింపును పేరుగా పెట్టుకుని పులకరింపుతో శతాబ్దాలుగా నిలిచి ఉంటే…కాదని మనం సాధించేదేముంటుంది? పవిత్రతను పాడు చేసుకోవడం తప్ప!”

రాముడి “లే! పక్షీ!” పిలుపే “లేపాక్షి”గా మారి గుడి గోపురమయ్యిందన్న విశ్వనాథవారి వాదనే స్థానికంగా కూడా అనాదిగా వినవస్తున్న కథనం.

మరికొన్ని వాదనలు కూడా ఉన్నా…వాటికి అంత అంగీకారం, ప్రచారం దొరకలేదు. విరుపణ్ణ ఈ ఆలయాన్ని నిర్మిస్తూ కోశాగారం డబ్బును దుర్వినియోగం చేశాడని గిట్టనివారు పెనుగొండలో అచ్యుతదేవరాయలుకు పితూరీలు చెప్పారు. ఆయన నమ్మి…విచారణ చేయకుండా విరుపణ్ణ కళ్లు పెరికించాల్సిందిగా శిక్ష విధించాడు. ఇది తెలిసిన విరుపణ్ణ మనసు విరిగి…తన కళ్లను తానే పెకలించుకుని…నిర్మాణంలో ఉన్న శివపార్వతుల కల్యాణ మంటపం గోడకు విసివేశాడు. దీనితో విరుపణ్ణకు మద్దతుగా శిల్పులు, నిర్మాణ కార్మికులు సమ్మె చేశారు. దాంతో ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది. ఆ సమయంలోనే నెలల తరబడి బయట ఖాళీగా ఉన్న శిల్పులు బసవయ్యను చెక్కారు. అందుకే లేపాక్షి నంది గుడి ప్రాకారాలకు సంబంధం లేకుండా ఊరవతల ఒంటరిగా ఉంది. విరుపణ్ణ కంటి నెత్తురు చారలు పడ్డాయి కాబట్టి-
లేప – పూత
అక్షి- కన్ను
“లేపాక్షి” అయ్యింది అని ఒక కథనం.

ఇందులో చాలా డ్రామా, విషాదం, మెలికలు, కన్నీళ్లు ఉండడంతో ఈ కథనం కథలు కథలుగా అల్లుకుంటోంది కానీ…విజయనగర పతనావస్థలో వరుస యుద్ధాల వల్ల ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టి లేపాక్షి ఆలయం అసంపూర్తిగా మిగిలిపోయి ఉంటుందన్నది చరిత్రకారుల నిర్ణయం. విరుపణ్ణకు శిక్ష, శిల్పుల సమ్మె, సమ్మె కాలంలో నందిని వారికి వారుగా ఉబుసుపోక చెక్కడం- కథనాలకు ఆధారాల్లేవు కాబట్టి కట్టు కథలే అనుకోవాలి.

లేపాక్షి పైకప్పు చిత్రాల్లో కళ్లకు ప్రాధాన్యం ఉండడంతో…లేప- పూత; అక్షి- కన్ను కలిపి “లేపాక్షి” అయ్యిందన్న వ్యుత్పత్తి అర్థం కృత్రిమంగా పండితులు సాధించినట్లే ఉంది తప్ప ఇందులో ఔచిత్యం లేదు. రాసి పోసిన శిల్ప సంపదను, రాతి సోయగాలను, గాలిలో వేలాడదీసిన రాతి స్తంభాలను వదిలి పైకప్పు కళ్లను మాత్రమే పట్టుకుని నామకరణం చేసి ఉంటారనే వాదనలో దృష్టి దోషం కొట్టొచ్చినట్లు కనపడుతోందని ఈ వాదనను వ్యతిరేకించేవారి కోణం.

అజ్ఞానమనే లేపనాన్ని తొలగించి…జ్ఞానమనే నేత్రాలను తెరిపించేది కాబట్టి- “లేపాక్షి” అని ఆధ్యాత్మికవేత్తలు సాధించిన అర్థం. ఇంత వేదాంత, పారమార్థిక పారిభాషిక జ్ఞానం మాకెందుకు? అన్నది సామాన్యుల వాదన.

ఈ వాదనల్లో ఏదో ఒకటే నిజమై ఉండాలి. ఏది నిజమో మీరే తేల్చుకోండి అని లేపాక్షి శిల్పం హొయలుపోతూ మనల్ను పిలుస్తూనే ఉంటుంది.

రేపు:- అదిగో లేపాక్షి-4
“ఏడు ప్రాకారాల లేపాక్షి”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Also Read:

అదిగో లేపాక్షి-2

RELATED ARTICLES

Most Popular

న్యూస్