4.4 C
New York
Friday, December 1, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅదిగో లేపాక్షి-2

అదిగో లేపాక్షి-2

History of Lepakshi:  లేపాక్షి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనదని మొదట అనుకునేవారు. భారత పురావస్తుతత్వ శాఖ తవ్వకాల్లో బయటపడ్డ శాసనాల ప్రకారం క్రీస్తు శకం 1400 నాటికే లేపాక్షిలో పాపనాశేశ్వర ఆలయం ప్రసిద్ధిలో ఉందని తేలింది. ఇక్కడ వీరభద్రుడు, పాపనాశేశ్వరుడు, దుర్గాదేవి, రఘునాథ స్వామి ప్రధానమైన దేవుళ్లు. “లేపాక్ష్యామ్ పాపనాశనః” అని స్కాంధపురాణంలో ఉన్నది ఈ లేపాక్షి పాపనాశేశ్వర స్వామి ప్రస్తావనే అన్నది ఎక్కువమంది పండితుల నిర్ణయం. 16వ శతాబ్దిలో విజయనగర రాజులు అచ్యుతదేవరాయలు, అళియరాయల దగ్గర పెనుగొండ మండల కోశాధికారిగా ఉండిన విరుపణ్ణ ఇలవేల్పు వీరభద్రస్వామి. విరుపణ్ణ కలల పంట మనముందున్న ఈ లేపాక్షి కళల పంట.

లేపాక్షిలో అప్పటికే కూర్మశైలం/కచ్ఛపాద్రి(తాబేలు ఆకారంలో ఉన్న రాతి కొండ) పై విడి విడిగా ఉన్న గుళ్లను కలుపుతూ విరుపణ్ణ ఏడు ప్రాకారాలతో ఒక మహాలయాయాన్ని నిర్మించినట్లు అనేక ఆధారాలున్నాయి. దక్షిణాపథంలో అప్పటికి గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించిన శిల్పి డకణాచారి వంశస్థుడైన ఒక మహా శిల్పిని విరుపణ్ణ, ఆయన సోదరుడు వీరణ్ణ ఈ ఆలయ నిర్మాణానికి ప్రత్యేకంగా పిలిపించి…బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది కానీ…ఆ శిల్పి పేరు ఇప్పటికి దొరికిన ఏ శాసనంలో లేదు. (ఆయన పేరు పురుషోత్తమ స్తపతి అని స్థానికులు కొందరు చెబుతున్నా… లేపాక్షి మీద ఇప్పటికి వెలువడ్డ ప్రామాణికమైన చరిత్ర గ్రంథాల్లో ఎక్కడా ఈ ప్రస్తావన లేదు) 1530-35 మధ్య మొదలైన లేపాక్షి ఆలయ నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యిందో సరైన ఆధారాల్లేవు. కనీసం 12 ఏళ్లు పట్టి ఉంటుందని…, దాదాపు రెండు వేల మంది శిల్పులు, నిర్మాణ కార్మికులు పని చేసి ఉంటారని పురావస్తు శాఖవారి అంచనా. 1565లో తళ్లికోట యుద్ధంలో శత్రువులు అళియరామరాయలు తల నరకడంతో విజయనగర రాజ్యం తల కూడా తెగిపోయి…350 ఏళ్ల అప్రతిహతమైన వైభవం శాశ్వతంగా కనుమరుగయ్యింది. విజయనగర రాజ్య పతనావస్థలో హంపీని వదిలిన రాజులు మరో హంపీని నిర్మించాలని కలలు కన్నారు. లేపాక్షి నుండి పెనుగొండ వరకు మరో మహా నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నించారు. వారి కల నెరవేరి ఉంటే…హంపీని తలదన్నే సకల కళల భూలోక స్వర్గం ఒకటి ఏర్పడి ఉండేది. కాలం చిన్న చూపు చూసింది. విజయనగర వైభవం కొడిగట్టింది. ఆ విజయనగర జ్యోతి కొండెక్కే ముందు లేపాక్షి కొండ మీద వెలిగించిన ఆధ్యాత్మిక, శిల్ప, చిత్ర కళా దీపం- మనమిప్పుడు చూస్తున్న లేపాక్షి ఆలయం.

అగస్త్యుడు దక్షిణాపథానికి వచ్చినప్పుడు ఇప్పుడు గర్భగుడి ఉన్న చోట పాపనాశేశ్వర, రఘునాథ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి పక్కన గుహలో తపస్సు చేసినట్లు ఒక శాసనాధారం చెబుతోంది. శ్రీరాముడు, హనుమంతుడు ప్రతిష్ఠించిన రామలింగం, హనుమ లింగం విడి విడిగా పూజలందుకుంటున్నాయి.

చాలా శాసనాల్లో పాపనాశేశ్వర ఆలయం అని ఉండడాన్ని బట్టి అప్పటికే ఒక ఆలయం ఉన్నట్లు… వీరభద్రుడి గర్భగుడి చుట్టూ అనేక గర్భ గుళ్లు విడిగా ఉండడాన్ని బట్టి…శివుడిని- విష్ణువును సమదృష్టితో చూడడంలో భాగంగా కట్టిన గుడిగోపురం లేపాక్షి అని అర్థం చేసుకోవచ్చు. గుమ్మానికి ఎదురుగా వీరభద్రుడు ప్రధానంగా ఉండడంతో వీరభద్రాలయం అనే పేరు వచ్చింది. గర్భాలయం పైకప్పు మీద అతి పెద్ద వీరభద్రుడి వర్ణ చిత్రం ఉంది. వీరభద్రుడి కాళ్ల దగ్గర విరుపణ్ణ, వీరన్న సోదరుల చిత్రం కూడా ఉంది. గర్భ గుడిలో ఒక మూల స్తంభంలో ఉన్న దుర్గమ్మ వల్ల దుర్గాలయంగా కూడా పేరు వచ్చింది. నిత్యపూజలు జరుగుతున్నది వీరభద్రుడు, దుర్గమ్మకే.

లేపాక్షిలో శివరాత్రి, దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. శివరాత్రి సందర్భంగా జరిగే రథోత్సవం కన్నులకు పండుగ.

(చెంచు సుబ్బయ్య(1944-2022) తిరుపతి, చెన్నయ్, పెనగలూరుల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. లేపాక్షి, హిందూపురం, ధర్మవరాల్లో తెలుగు లెక్చరర్ గా పనిచేసి…పదవీ విరమణ తరువాత టిటిడిలో అనేక హోదాల్లో ఆధ్యాత్మిక సాహితీ యజ్ఞాన్ని కొనసాగించారు. త్యాగరాజు భక్తి తత్త్వం మీద పి హెచ్ డి చేశారు. రెండు వందలకు పైగా అష్టావధానాలు చేశారు. వందకు పైగా వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. 1977 లో ఆరాధన ఆధ్యాత్మిక మాస పత్రికలో ప్రచురితమైన ఆయన వ్యాసంలో ఇది కొంత భాగం)

-పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మ

ఫొటోలు: దాసరి రవీంద్రనాథ్
లక్ష్మి స్టూడియో, హిందూపురం

రేపు:- అదిగో లేపాక్షి-3
లేపాక్షికి ఆ పేరెలా వచ్చింది?

Also Read:

అదిగో లేపాక్షి-1

RELATED ARTICLES

Most Popular

న్యూస్