భారత రక్షణ శాఖ దేశ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరిన్న రక్షణ చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, చైనా నుంచి వస్తున్న సరిహద్దు సమస్యలను ఎదుర్కొనేందుకు శ్రీనగర్ బేస్‌ను మరింత పటిష్టం చేశారు. ఆ బేస్ వద్ద ఇప్పుడు మిగ్-29 యుద్ధ విమానాలకు చెందిన స్క్వాడ్రన్‌లను మోహరించారు. మిగ్-21 బృందాల స్థానంలో ఇప్పుడు మిగ్-29 బృందాలు పనిచేయనున్నాయి. ఈ బృందాన్ని డిఫెండర్ ఆఫ్ నార్త్‌గా పిలుస్తున్నారు.
MiG-29 Fighter: పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో రక్షణ చర్యలు
మిగ్-29 చాలా అప్‌గ్రేడ్ యుద్ధ విమానాలని పైలెట్ స్క్వాడ్రన్ లీడర్ శివమ్ రాణా తెలిపారు. నైట్ విజన్ గగూల్స్‌తో ఈ విమానాలను రాత్రి పూట కూడా ఆపరేట్ చేయవచ్చు అన్నారు. ఎయిర్ టు ఎయిర్ రీఫ్యుయలింగ్ సామర్థ్యం ఉన్న కారణంగా .. వీటిని లాంగ్ రేంజ్‌లో కూడా ఆపరేట్ చేయవచ్చు అని చెప్పారు. భారతీయ వైమానిక దళానికి చెందిన పైలెట్లే ఈ విమానాలను ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు.
కశ్మీర్ లోయలో శ్రీనగర్ చాలా ఎత్తు ప్రదేశంలో ఉందని, ఇలాంటి ప్రదేశంలో మిగ్-29 యుద్ధ విమానాన్ని మోహరించడం చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఐఏఎఫ్ పైలెట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ తెలిపారు. లాంగ్ రేంజ్ మిస్సైళ్లు లాంచ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నారు.