హిమాలయ పర్వత ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ భక్తులను అప్రమత్తం చేశారు.
కేదర్‌నాథ్ ఆలయానికి వచ్చే భక్తులకు మెజిస్ట్రేట్ పలు సూచనలు చేశారు. భక్తులు ఒకే చోట ఉండాలని సూచించారు. ప్రస్తుతం కేదర్‌నాథ్ ధామ్‌లో మంచు కురుస్తుందని తెలిపారు. ఉదయం 10:30 గంటల తర్వాత సోన్‌ప్రయాగ్ నుంచి కేదర్‌నాథ్‌కు భక్తుల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించారు.
జిల్లా యంత్రాంగానికి భక్తులు సహకరించాలని మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం పూర్తిగా చక్కబడిన తర్వాతనే కేదర్‌నాథ్‌కు భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన కేదర్‌నాథ్ ఆలయం తలుపులు తెరిచిన సంగతి తెలిసిందే.