7.1 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeTrending NewsTelangana BJP: తిరోగమనంలో తెలంగాణ బిజెపి

Telangana BJP: తిరోగమనంలో తెలంగాణ బిజెపి

తెలంగాణలో సూపర్ స్పీడులో ఉన్న బిజెపి ఒక్కసారిగా చతికిల పడ్డట్టుగా కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా బండి సంజయ్ ను మార్చిన నాటి నుంచి పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. పాదయాత్రలు, ఆందోళనలు, నిరసనలతో నిత్యం ప్రజల మధ్య ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించిన బండి సంజయ్… పార్టీని బలోపేతం చేశారనతంలో అతిశయోక్తి లేదు.

ఏ మాత్ర అవకాశం చిక్కినా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన..సిఎం కుటుంబ సభ్యులపై విరుచుకుపడే వారు. బండి సంజయ్ హయంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలకు జాతీయ నాయకత్వం కూడా సహకరించింది. ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులు, కేంద్ర మంత్రులు వచ్చేవారు. ఢిల్లీలో కెసిఆర్ పథకాలను మెచ్చుకున్నా… తెలంగాణలో విమర్శించే వారు.

విమర్శలు… ప్రతివిమర్శలతో కేంద్రమంత్రుల్లో  కూడా కెసిఆర్ పట్ల విముఖత కలిగేలా బండి సంజయ్ చేయగలిగారు. బీ ఆర్ ఎస్ నాయకులు ఢిల్లీ వెళ్ళినా కమలం నేతలతో అన్తీముత్తనట్టుగా వ్యవహరించేవారు. కేంద్రమంత్రులతో మర్యాద కోసం ముక్తసరిగా పలకరించేవారు. ఒకదశలో కేంద్రం… రాష్ట్రం మధ్య దూరం పెరిగింది.

 

మునుగోడులో బిజెపి ఓడిపోయినా…నైతికంగా తమ పార్టీనే గెలిచింది అన్నట్టుగా కమలం శ్రేణులు భావించాయి. కిషన్ రెడ్డి రాకతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శ్రేణుల్లో నిరసనలు… నిర్లిప్తత నెలకొంది. పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా కిషన్ రెడ్డి విమర్శలు… ఉకదంపుడు ఉపన్యాసాలు క్యాడర్ ను ఆకట్టుకోవటం లేదు.

బండి సంజయ్ హయంలో బిజెపిలో చేరేందుకు వివిధ పార్టీల వారు నిత్యం చర్చలు జరిపేవారు. ఇప్పుడు ఉన్న నేతల్ని కాపాడుకోవటం కష్టంగా మారింది. తెలంగాణ విమోచన దినం పేరుతో హైదరాబాద్ లో నిర్వహించిన సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను తీసుకువచ్చినా… ప్రజల సంగతి దేవుడెరుగు… పార్టీ  శ్రేణులనే ఉత్తేజ పరచలేకపోయింది. అదేరోజు కాంగ్రెస్ నిర్వహించిన సభ హస్తం శ్రేణుల్లో జోష్ నింపింది.

పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయినా…పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ ఈటెల రాజేందర్ తానే పార్టీని నడిపిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బిజెపి గెలిస్తే ముఖ్యమంత్రి అనే భ్రమల్లో ఈటెల రాజేందర్ నడుచుకుంటున్నారు. మరో మూడు నెలల్లో అన్ననే సిఎం అవుతారని ఈటెల అనుచరవర్గం ఉంది. ఈ మధ్య మీడియాతో ఈటెల వ్యవహారశైలి కూడా అదేవిధంగా ఉందని కమలం నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్ 17న కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో తమను నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన నేతలు రగిలిపోతున్నారు. అమిత్ షా కేవలం బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల తదితరులతో భేటీ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశ అని చెప్పి ఆ ముగ్గురితోనే సమావేశం కావటంతో వివేక్, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్, విజయశాంతి తదితరులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి,  జిట్టా బాలకృష్ణా రెడ్డిలను పార్టీ నుంచి సాగనంపటం వారు కాంగ్రెస్ వైపు తిరగటం చకచక జరిగిపోయాయి. తాజాగా మాజీ మంత్రి దేవేదర్ గౌడ్ కుమారుడు వీరెంధర్ గౌడ్ పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలకు ఒక ముఖ్యమైన కారణం ఉందని….బిజెపి, బీ ఆర్ ఎస్ ల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని రెండు పార్టీల్లో అంతర్గతంగా ప్రచారం ఉంది. మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవటం కూడా బిజెపి శ్రేణులకు చికాకు కల్పిస్తోంది.

మొత్తానికి రాబోయే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ కు ప్రత్యాన్మయం బిజెపి అన్న స్థాయి నుంచి పార్టీ పరువు పోకుండా ఉండేందుకు తాపత్రయ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిషన్ రెడ్డి పనితనం పరిశీలించినా… పార్టీ అధ్యక్షుడిగా కన్నా.. కేంద్రమంత్రి పదవికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ నేతలు…ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో పార్టీని నిలబెట్టేందుకు జాతీయ నాయకత్వం ఎలాంటి కార్యాచరణ చేపడుతుందో వేచి చూడాలి..

RELATED ARTICLES

Most Popular

న్యూస్