రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కూటమిని డీకొనేందుకు ఇండియా కూటమి సన్నాహాలు మొదలుపెట్టింది. భాగస్వామ్య పక్షాల ఐక్యతను చాటే విధంగా…ముంబై వేదికగా ఇవాళ, రేపు ఇండియా కూటమి సమావేశాలు జరగనున్నాయి. మీటింగ్‌లో తీసుకోనున్న కీలక నిర్ణయాలు రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి. ఇండియా కూటమి అధికారిక లోగోను కూడా ఈ మీటింగ్‌లోనే విడుదల చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కూటమికి ఛైర్మన్, చీఫ్ కోఆర్డినేటర్‌లతో పాటు దాదాపు ఐదుగురు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించాలనే ప్రతిపాదన ఉందని తెలిపాయి. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటు ఎలా జరగాలనే దానిపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా 450 పార్లమెంటు స్థానాల్లో కూటమి తరఫున ఒకే అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నారు. ముంబైలో జరగబోయే మీటింగ్‌కు కాంగ్రెస్ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకానున్నారు.
మరోవైపు భాగస్వామ్య పక్షం విమర్శలు సంచలనం రేపుతున్నాయి. మతతత్వంపై కాంగ్రెస్, బీజేపీలది ఒకే విధానమని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. బుధవారం కొట్టాయంలో విజయన్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయన్నారు. కాగా, ప్రతిపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఎం భాగస్వామ్య పక్షాలుగా ఉండటం గమనార్హం.