Friday, September 20, 2024
HomeTrending NewsMarathwada: తీవ్రమవుతున్న మరాఠ్వాడా ఉద్యమం

Marathwada: తీవ్రమవుతున్న మరాఠ్వాడా ఉద్యమం

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం మళ్లీ ఊపందుకొన్నది. మూడు రోజుల క్రితం జాల్నా జిల్లాలో పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆందోళనలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పుణె జిల్లాలోని బారామతి పట్టణంలో వివిధ మరాఠా సంఘాలు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఆందోళనకారులపై లాఠీచార్జిని నిరసిస్తూ బీజేపీ-షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఔరంగాబాద్‌, హింగోలి, సతారా, నాందేడ్‌లలో బంద్‌ పాటించారు. చత్రపతి శంభాజీ నగర్‌లో ఆందోళనకారులు రహదారి దిగ్బంధించారు. కల్యాణ్‌ పట్టణంలో దుకాణాలను మూసివేశారు. పుణేలో ప్రతిపక్ష శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్‌ పవార్‌ గ్రూపు), కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. మరాఠీల సహనాన్ని పరీక్షించొద్దని ప్రభుత్వానికి నేతలు హితవు పలికారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌లు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.

విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని గత నెల 29 నుంచి జాల్నా జిల్లా అంతర్వాలి సారథి గ్రామంలో మనోజ్‌ జరాంగే నేతృత్వంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. లాఠీచార్జిలో గాయపడిన ఆందోళనకారులను ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ పరామర్శించారు. ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే కూడా సోమవారం జాల్నాలో ఆందోళనకారులను కలిశారు.

 

లాఠీచార్జి ఘటనపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎం షిండే, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లు జనరల్‌ డయ్యర్‌ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని, శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై లాఠీచార్జికి ఆదేశాలు ఇచ్చారని జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతాన్ని ఉద్దేశించి రౌత్‌ వ్యాఖ్యానించారు. లాఠీచార్జి నేపథ్యంలో సీఎం షిండే జాల్నా ఎస్పీ తుషార్‌ను సెలవుపై పంపించారు. అదేవిధంగా ఇద్దరు డీఎస్పీ ర్యాంకు అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.మరాఠా రిజర్వేషన్ల అంశంపై నిపుణులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసినట్టు సీఎం షిండే వెల్లడించారు.

వచ్చే ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై అధికార బీజేపీ, శివసేన(షిండే వర్గం) కలవరపడుతున్నాయి. మరాఠా రిజర్వేషన్ల అంశంపై ఎన్నికల్లో ఎక్కడ దెబ్బకొడతాయోనని ఆందోళన చెందుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జికి ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ సోమవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జాల్నా ఘటనపై సీఎం షిండే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారని తెలిపారు.

నిరాహార దీక్షను విరపింపజేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఉద్యమ నేత మనోజ్‌ జరాంగే పాటిల్‌ తిరస్కరించారు. మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంలోగా ప్రకటన చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే బుధవారం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ రోజు (మంగళవారం) నుంచి నీరు తాగడం కూడా ఆపేస్తానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్