Wednesday, May 7, 2025
HomeTrending NewsNuh violence: నూహ్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌...కీలక నిందితుడి అరెస్ట్

Nuh violence: నూహ్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌…కీలక నిందితుడి అరెస్ట్

హర్యానా రాష్ట్రం నూహ్ జిల్లాలో చెలరేగిన మతఘర్షణల్లో ఓ నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని తౌరు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌ లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లకు పాల్పడిన నిందితులు ఇద్దరు బైక్‌పై పారిపోతుండగా గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపారు. ఓ నిందితుడి కాలికి బుల్లెట్‌ తగలడంతో అతను కింద పడిపోయాడు. దీంతో వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. అతడి వద్ద నుంచి దేశీయ పిస్టోల్‌, ఐదు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుని వాసింగా గుర్తించారు.

అతడిపై రూ. 25 వేల రివార్డు ఉందని, హత్య, లూటీ సహా పలు కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాసింను తౌరు లోని అరావల్లిలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడి కాలికి బుల్లెట్ గాయం కావడంతో నల్‌హాద్ మెడికల్ ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. అతడి నుంచి దేశీయ తుపాకి, ఐదు కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, నూహ్ లో వారం రోజుల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం.

జులై 31వ తేదీన వీహెచ్‌పీ మత ఊరేగింపు సందర్భంగా నూహ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలు క్రమంగా పొరుగున ఉన్న గురుగ్రామ్‌కు కూడా పాకాయి. గుర్‌గ్రామ్‌లోని బాద్‌షాపూర్‌లో ఓ రెస్టారెంట్‌తో పాటు 14 దుకాణాలను ధ్వంసం చేశారు. సెక్టార్‌ 66 పరిధిలో ఏడు దుకాణాలకు నిప్పుపెట్టారు. బైక్‌లు, కార్లలో వచ్చిన దాదాపు 200 మందితో కూడిన గుంపు ప్రధానంగా బిర్యానీ అమ్మే దుకాణాలు, ఇతర ఫుడ్‌స్టాళ్లపై దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 100 మందిని అరెస్ట్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్