Friday, November 22, 2024
HomeTrending NewsPakistan: త్వరలో తోషాఖానా కానుకల వేలం - పాక్ ప్రధాని ప్రకటన

Pakistan: త్వరలో తోషాఖానా కానుకల వేలం – పాక్ ప్రధాని ప్రకటన

పాకిస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. తోషాఖానా కానుకల ద్వారా వచ్చిన డబ్బును పేదలు, నిస్సహాయకుల కోసం వినియోగిస్తామని వెల్లడించారు.

పాక్‌ మీడియా నివేదిక ప్రకారం.. ‘తోషాఖానాలోని మిలియన్ల విలువైన బహుమతులను వేలం వేయాలని నిర్ణయించాను. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అనాథ పిల్లల సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు,  విద్యా సంస్థలు, వైద్య సదుపాయాల కోసం వినియోగిస్తాం. వాటికి తప్ప ఆ నిధులు మరెక్కడికీ వెళ్లవు’ అని
షెహబాజ్‌ వెల్లడించారు. మరోవైపు తోషాఖానా బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసులోనే మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ బహుమతులను వేలం వేయాలని షెహబాజ్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

నేడు పాక్‌ జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు..

మరోవైపు ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు చేయనున్నట్లు షెహబాజ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం ముగియడానికి మూడు రోజుల ముందే దాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని ఈనెల 9న (నేడే) సిఫార్సు చేస్తానని షెహజాబ్ ఇటీవలే వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు పాక్‌ పీఎం పదవికి షెహబాజ్‌ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల రాజ్యాంగ పదవీకాలం ఆగస్టు 12న అర్ధరాత్రితో ముగియనుంది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీని రద్దు చేస్తే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల నిర్ణీత గడువుకు ముందే ప్రభుత్వం కూలిపోతే, లేక పార్లమెంట్ ముందే రద్దయితే పాకిస్థాన్ ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. దీంతో నిర్ణీత కాలానికి ముందే రద్దు చేయడం తమకు కలిసొస్తుందని పీఎంఎల్-ఎన్ నేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ కూటమి భావిస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం నేషనల్ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్ ను అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి.. ప్రధాని షరీఫ్ పంపనున్నట్లు ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్