నక్సలైట్లు వారి సిద్ధాంతాల ద్వారా హింసతో సాధించేది ఏమీ లేదని, అడవిని వీడి, జనజీవనంలోకి రావాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పిలుపు ఇచ్చారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు అడవిని వీడి లొంగిపోతే వైద్యం అందిస్తామని రామగుండం కమిషనర్ తెలిపారు. అడవిలో ఉంటూ చేసేదేమీ లేదని, అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దని హితవు పలికారు. రామగుండం కమిషనరేట్ పరిదిలోని పెద్దపల్లిలో సిపిఐ మావోయిస్టు పార్టీలో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న పెద్దపల్లి పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ మల్లోజుల వేణుగొపాల్ రావు ఇంటికి వెళ్లి తల్లి మధురమ్మతో రామగుండం సీపీ సత్యనారాయణ మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అజ్ఞాత నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేలా కుటుంబీకులు కోరాలని కుటుంబీకులకు సూచించారు.
ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తామన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం, పోలీసులు ఉన్నారని ఏలాంటి ఇబ్బందులు ఉన్నా చట్టపరిధిలో పరిష్కరిస్తామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజా స్వామ్యంలో అందరితో కలిసి, కుటుంబ సభ్యులతో ఆనందమైన జీవితం గడపాలని కోరారు. సీపీ వెంట పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఓఎస్డీ శరత్ చంద్ర పవరస్, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్ ఉన్నారు.