7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeTrending NewsAlishetty Prabhakar: అభ్యుదయ కవి అలిశెట్టికి అవమానం

Alishetty Prabhakar: అభ్యుదయ కవి అలిశెట్టికి అవమానం

జగిత్యాల జైత్రయాత్రతో స్పూర్తి పొందిన అలిశెట్టి ప్రభాకర్ తక్కువ పదాలతో ఎక్కవ అర్ధాలను పలికించి…తన కవితలతో నాటి సమాజాన్నంతా నడిపించాడు. ఆలోచింపజేశాడు. యువతరాన్ని మేల్కొల్పాడు. సామాజిక జీవితంలోని అన్ని కోణాలను పట్టుకుని వాడియైన కవిత్వం రాసిన ఘనత అలిశెట్టిది.

నాటి ఉమ్మడి పాలనలో సామాన్యులకు జరిగే అన్యాయాలపై కలం పోరాటం చేసిన సృజనాత్మక కవి అలిశెట్టి. దారితప్పిన సామాజిక పోకడలను పదునైన పదాలతో కూడిన సునిశిత వ్యంగ్యంతో సరిదిద్దే ప్రయత్నం చేసినాడు.

ఉదాసీనంగా ఉండే కన్నీళ్ళే ఉప్పొంగే నదులైనప్పుడు, దండాలు పెట్టే బాంచెన్ బతుకులు దండకారణ్యాలై రగులుకోవా అంటాడు. అంతేకాదు ఎన్నికల బరిలో దిగాలో, నక్సల్బరిలో దూకాలో.. క్షణం క్షణం రణం! సందిగ్ధా వస్థలో జనం!! అంటూ లోపభూయిష్టమైన వ్యవస్థే… వ్యక్తుల్ని తుపాకులుగా తీర్చిదిద్దుతుందన్న కవి.

తెలంగాణ వచ్చిన ఇన్నేళ్ళ తర్వాత పాలకులకు అభ్యుదయ కవి గుర్తుకు వచ్చాడు. అదీ ఎన్నికల సమయంలో…డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించి చేదోడుగా నిలిచినట్టా.. దిగజార్చినట్లా?

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏనాడు కేంద్ర స్థాయి అవార్డులకు అలిశెట్టి పేరు ప్రతిపాదించలేదు. సమాజాన్ని చైతన్యం చేస్తూ… రాజకీయాలను, నాయకులను ఈసడించుకుంటు ఆంధ్రజ్యోతిలో సిటి లైట్స్ శీర్షికన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తనువు పుండై… తాను పండై…తాను శవమై…వేరొకరి వశమై…తాను ఎడారై … ఎందరికో.. ఒయాసిస్సై…. అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి ఆయన రాసిన కవిత సుప్రసిద్దమైనది. అలిశెట్టికి చదువుల డిగ్రీలు లేకున్నా అతని కవిత్వం ఎందరికో బతుకుదారి చూపింది. సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాల తరఫున బాధ్యత కలిగిన సైనికుడుగా అక్షర పోరాటం చేసినవాడు.

తెలంగాణ వచ్చాక ప్రభాకర్ భార్య భాగ్యమ్మకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించింది ప్రభుత్వం. అదే సమయంలో వారి కుటుంబం నిలదోక్కుకునేలా చర్యలు తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు హైదరాబాద్ అసీఫ్ నగర్ లోని జియాగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళ సముదాయంలో వొకదానిని కేటాయించారు. ప్రభుత్వ నిర్ణయం హర్షించతగినదే అయినా.. అలిశెట్టి స్థాయికి తగిన కాదు.

సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యతలు ఇస్తున్న ప్రభుత్వం…పలుకుబడి ప్రదర్శించిన వారికి వెండి కంచం…లేదంటే అక్కడే ఉండు కొంచెం అన్నట్టుగా వ్యవహరిస్తోంది.

అలిశెట్టి ప్రభాకర్ పేరున అభ్యుదయ కవిత్వానికి అవార్డు పెట్టాల్సింది పోయి కాళోజీ అవార్డు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు సంగ్రామ్, సంకేత్ వారికి సముచిత స్థాయిలో ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అలిశెట్టి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

సమాజాన్ని చైతన్యం చేస్తున్న వర్ధమాన కవులను ప్రోత్సహించేలా అలిశెట్టి పురస్కారం..తగిన పారితోషికంతో అవార్డు ఏర్పాటు  చేయాలని సాహితీ లోకం కోరుకుంటోంది.

అలిశెట్టి ప్రభాకర్ పేరు చిర స్థాయిగా గుర్తు ఉండేలా…స్వతహాగా సాహిత్య ప్రియుడైన ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ తీసుకోవాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్