సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. గర్భవతి అయిన ఓ అత్యాచార బాధితురాలికి ఊరట కల్పించింది. ప్రెగ్నెన్సీని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని, గర్భాన్ని దాల్చడం దంపతులకు సంతోషకరమైన అంశమని, సమాజానికి కూడా అది మంచి సంకేతాన్ని ఇస్తుందని, కానీ వివాహం కాని వారు గర్భాన్ని దాల్చడం వల్ల అది ఆ మహిళ మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని కోర్టు తన తీర్పులో తెలిపింది.
ఈ కేసులో ఆగస్టు 20లోగా వైద్య నివేదిక ఇవ్వాలని గత విచారణలో సుప్రీంకోర్టు పేర్కొన్నది. గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి నిరాకరించిన గుజరాత్ హైకోర్టు తీర్పును కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇలాంటి కేసుల్లో కొంత వేగాన్ని చూపాలని సుప్రీం అభిప్రాయపడింది. నిర్లక్ష్యపూరిత వైఖరి సరికాదు అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
గర్భాన్ని తీసివేసేందుకు అనుమతి ఇవ్వాలని అత్యాచార బాధితురాలు పెట్టుకున్న పిటిషన్‌ను తొలుత గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అసలు గుజరాత్ హైకోర్టులో ఏం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు వ్యతిరేకంగా దేశంలోని దిగువ కోర్టులు ఆదేశాలు ఇవ్వడం సరికాదు అని సుప్రీం పేర్కొన్నది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టు తెలిపింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది.