Saturday, November 23, 2024
HomeTrending NewsED Mishra: ఈడీ డైరెక్టర్‌ పదవీ కాలం పొడిగింపు చట్ట విరుద్దం - సుప్రీంకోర్టు

ED Mishra: ఈడీ డైరెక్టర్‌ పదవీ కాలం పొడిగింపు చట్ట విరుద్దం – సుప్రీంకోర్టు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సంజయ్‌కుమార్‌ మిశ్రా పదవీకాలం పొడిగింపు నిర్ణయం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. అయితే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ సమీక్షను పరిగణనలోనికి తీసుకొని ఈ నెల 31 వరకు మాత్రమే మిశ్రా ఈడీ డైరెక్టర్‌గా కొనసాగేందుకు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌తో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ‘2021లో మేమిచ్చిన తీర్పు(మాండమస్‌)కు బద్ధులమై ఉంటామని చెప్పి కూడా దాన్ని కేంద్రం, మిశ్రా అతిక్రమించారు. ఒక ఆర్డినెన్స్‌ లేదా చట్టం చేసి మా నిర్ణయాన్ని రద్దు చేయాలని ప్రయత్నించడాన్ని మేం అనుమతించలేం’ అని బెంచ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ ఏడాది మార్చిలో అమికస్‌ క్యూరీ కేవీ విశ్వనాథన్‌… ఈడీ డైరెక్టర్‌గా మిశ్రా పదవీ కాలం పొడిగింపును సవాల్‌ చేశారు.

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) 2003 చట్టాన్ని సవరించి కావాలనే మరీ ఈడీ డైరెక్టర్‌గా మిశ్రా పదవీ కాలం పొడిగించడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషనైర్లెన కామన్‌ కాజ్‌ ఎన్జీవో, జయ ఠాకూర్‌, కాంగ్రెస్‌, టీఎంసీ నేతలు చేసిన వాదన పరిగణనలోనికి తీసుకున్న ధర్మాసనం కేంద్రం నిర్ణయాన్ని చట్ట విరుద్ధమని తేల్చింది.  సీవీసీ చట్టానికి చేసిన సవరణలు తాము అంగీకరిస్తామని.. అయితే మిశ్రా విషయంలో ఈ సవరణలు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ నాయకులు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నందునే కొందరు ఈ విషయమై కోర్టులో పిల్‌ వేశారన్న కేంద్రం వాదనను కొట్టి పారేసింది. వాస్తవానికి నవంబర్‌ 2020లోనే మిశ్రా పదవీ కాలం పూర్తయినా కేంద్రం రాష్ట్రపతి ఉత్తర్వును సరిదిద్ది పదవీ కాలాన్ని రెండేండ్ల నుంచి మూడేండ్లకు పెంచింది. 2021 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వుకు ఆమోదం తెలిపింది. అయితే ఇకపై ఆయన పదవీ కాలం పొడిగింపునకు అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పంది. అయితే ఆ తీర్పును కేంద్రం లెక్క చేయకుండా సీవీసీ చట్టానికి సవరణ చేసి ఈడీ డైరెక్టర్‌ పదవీ కాలాన్ని అయిదేండ్లకు పెంచుతూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. దీనిపై పార్లమెంటులో చట్టం కూడా చేసింది.

మరోవైపు మిశ్రా పదవీకాలం పొడిగింపు నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించడంపై కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది కేంద్రానికి చెంప పెట్టని పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. మిశ్రా ఈడీ చీఫ్‌గా ఉన్న సమయంలో చేసిన పనులపై విచారణ జరపాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది.

ఈడీ చీఫ్‌గా ఎస్కే మిశ్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత విపక్ష పార్టీ నేతలపై ఈడీ నమోదు చేసిన కేసులు పార్టీలవారీగా ఇలా ఉన్నాయి. కాంగ్రెస్‌-24, టీఎంసీ-19, ఎన్సీపీ-11, శివసేన (ఠాక్రే)-8, బీఆర్‌ఎస్‌-8, డీఎంకే-6, బీజేడీ-6, ఆర్జేడీ-5, బీఎస్పీ-5, ఎస్పీ-5, టీడీపీ-5, ఆప్‌-4, ఐఎన్‌ఎల్డీ-3, వైసీపీ-3, సీపీఎం-2, ఎన్సీ-2, పీడీపీ-2, అన్నాడీఎంకే-1, ఎంఎన్‌ఎస్‌-1, ఎస్బీఎస్పీ-1, స్వతంత్రులు-2.

RELATED ARTICLES

Most Popular

న్యూస్