లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీమ్ కోర్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు మొట్టికాయలు వేసింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసులో పదవి విరమణ చేసిన న్యాయమూర్తి విచారణ ప్రారంభించారని యుపి ప్రభుత్వం వివరణ ఇవ్వగా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ జస్టిస్ హిమ కోహ్లి, సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం రెండో రోజు విచారణ జరిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా సుప్రీమ్ కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రమంత్రి కుమారుడికి సమన్లు జారీ చేశామని యుపి ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇవ్వగా రోజు వారిగా జరిగే హత్య కేసుల్లో పోలీసులు ఇలాగే వ్యవహరిస్తున్నారా అని ధర్మాసనం ఆక్షేపించింది. అరెస్టుకు బదులు సమన్లు ఇస్తున్నారా అని ప్రశ్నించింది. ప్రధాన నిదితుడిగా ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకపోతే సమాజానికి, దేశానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సుప్రీమ్ కోర్టు ధర్మాసనం మందలించింది.
లఖింపూర్ ఖేరి ఘటన విచారణను సుప్రీమ్ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోగా ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించాలని, సాక్ష్యాలు, సాక్షులకు తగిన రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ డిజిపీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.