సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. 2019 ఎన్నికల్లో కర్నాటకలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మోడీ ఇంటి పేరున్న వారంతా దొంగలేనంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే రాహుల్ పై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీకి సైతం నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించడాన్ని నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.
సూరత్ కోర్టు తీర్పు కొట్టేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన అభ్యర్దనపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 4కు వాయిదా వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సూరత్ వెస్ట్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ‘మోదీ ఇంటిపేరు’ కేసులో ఆయన్ను సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో రాహుల్ గాంధీ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అనంతరం జిల్లా కోర్టుతో పాటు హైకోర్టులోనూ రాహుల్ కు చుక్కెదురైంది. ఈ కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు కూడా సమర్ధిస్తే ఆయన జైలుకు వెళ్లక తప్పదు. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోతారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ విపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీలోనూ టెన్షన్ పెంచుతోంది. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం లేక శిక్ష తగ్గిస్తే పరిణామాలు మరోలా ఉండొచ్చని భావిస్తున్నారు.