ఎం కే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రజా రంజకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్ ను స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైద్య విద్యతో సహా అన్ని కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్ వర్తింపచేసే బిల్లును ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టింది.
ఢిల్లీ హైకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి మురుగేషన్ నేతృత్వంలోని కమిటీ విధి విధానాలు రూపొందించనుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరుగుతుందని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి కట్టడి, నివారణకు అఖిలపక్ష నాయకులతో కమిటీ ఏర్పాటు, జయలలిత పేరుతో క్యాంటిన్ కొనసాగించటం వంటి నిర్ణయాలతో స్టాలిన్ రాజకీయ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్ని ప్రోత్సహించేందుకు, పేద విద్యార్థులకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోవడంతో స్టాలిన్ కు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.