Thursday, March 12, 2026
HomeTrending Newsలాక్ డౌన్ ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

లాక్ డౌన్ ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది.
లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

దేశవ్యాప్తంగానే కాకుండా, పక్కరాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి  వచ్చిందన్న నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్దారించింది.

ఈ మేరకు…జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్ డౌన్ ను రేపటినుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది.

అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థత తో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. విద్యార్ధులు తరగతులకు హాజరు కావచ్చని స్పష్టం చేసింది.

ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సానిటైజర్ ఉపయోగించడం.. తదితర  కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు., ప్రజలు  సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular