అమెరికాలో తుపాకి సంస్కృతి రోజు రోజు పెచ్చు మీరుతోంది. ఆయుధాలు ధరించి కనిపించిన వారిని కాల్చి వేయటం సాధారనంగా మారింది. వారంలో ఒక రోజు ఖచ్చితంగా అమెరికాలోని ఏదో ఒక ప్రాంతంలో ఉన్మాదుల తుపాకి కాల్పులకు అమాయకులు బలవుతున్నారు. తాజాగా టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో దారుణం జరిగింది. కాల్పులు ఆపమన్నందుకు ఐదుగురు వ్యక్తులను కాల్చిచంపాడు దుండగుడు. ఐదుగురిని పొట్టన పెట్టుకున్న ఆ నిందితుడి కోసం 200 మంది పోలీసులు గాలిస్తున్నారు. క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన ఫ్రాన్సిస్‌స్కో ఓరోపెసా(38) అనే వ్యక్తి ఏఆర్-15 స్టైల్ రైఫిల్‌తో శుక్రవారం రాత్రి సమయంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఆ కాల్పుల శబ్దానికి పొరుగింట్లో ఉన్న ఓ 8 ఏండ్ల బాబు నిద్ర లేచాడు. దీంతో తమ నిద్రకు ఆటంకం కలుగుతుందని, కాల్పులు ఆపాలని ఆ వ్యక్తిని బాధిత కుటుంబం కోరింది. ఓరోపెసా వారి మాటలు వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా వారిపై కాల్పులు జరిపి ఐదుగురిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ కాల్పులు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. క్లీవ్‌ల్యాండ్‌లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. నిందితుడి సమాచారం అందిస్తే 80 వేల డాలర్లను పారితోషికంగా ఇస్తామని ప్రకటించారు.