Sunday, January 19, 2025
HomeTrending NewsFrance: అట్టుడుకుతున్న ఫ్రాన్స్...బెల్జియంకు పాకిన ఆందోళనలు

France: అట్టుడుకుతున్న ఫ్రాన్స్…బెల్జియంకు పాకిన ఆందోళనలు

పోలీస్‌ కాల్పుల్లో నాహెల్‌ అనే 17 ఏండ్ల యువకుడి మృతితో ఫ్రాన్స్‌లో మూడో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యువత పెద్దయెత్తున ఆందోళనలో పాల్గొని విధ్వంసం సృష్టించారు. ముందుజాగ్రత్త చర్యగా పారిస్‌లో బస్సు, ట్రామ్‌ సర్వీసులను నిలిపివేశారు. ఆ ఆందోళన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు కూడా పాకింది. ఆందోళనకారులకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనాన్‌లు ప్రయోగించగా, ఆందోళనకారులు రాళ్లు, వెలిగించిన నిప్పు వస్తువులను వారిపైకి విసిరారు. పారిస్‌ శివారు క్లామర్ట్‌లో కర్ఫ్యూ విధించారు. గత రాత్రి నుంచి దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో 200 మంది పోలీస్‌ అధికారులు గాయపడగా, 600 మందిని అరెస్ట్‌ చేశారు.

పారిస్‌ సబ్‌ అర్బన్‌ నాంటెర్రెలో పోలీస్‌ వాహనాలతో పాటు పలు కార్లకు నిప్పుపెట్టారు. సిటీలోని ఒక పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. పారిస్‌లోని రివోలిలో పలు షాపులను లూటీ చేశారు. అబుర్‌విల్లర్స్‌లో కూడా ఒక బస్సు డిపోను తగులబెట్టారు. పారిస్‌, పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహంతో పలువురు పోలీసులపై టపాకాయలను వెలిగించి విసరడం కన్పించింది. కాగా, గొడవలను నివారించడానికి 40 వేల మంది పోలీసులను మోహరించారు. మొరాకో యువకుడిపై మంగళవారం కాల్పులకు పాల్పడ్డ పోలీస్‌ అధికారి పాస్కల్‌ ప్రాచెపై విచారణ ప్రారంభమైంది. తన క్లయింట్‌ ఉద్దేశపూర్వకంగా కాల్పులకు పాల్పడలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయను కాల్పులకు దిగాల్సి వచ్చిందని ఆయన లాయర్‌ తెలిపారు. జరిగిన దురదృష్టకర ఘటనకు పోలీస్‌ అధికారి క్షమాపణ కోరుతున్నట్టు అయన చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్