విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశం కంటే ముందే పలు కీలక చర్యలు చేపట్టింది. విశాఖ స్టీల్ సీఎండీగా ఉన్న అతుల్ భట్‌ను విధుల నుంచి తప్పించి, రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వున్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది.
ప్లాంట్ ప్రయివేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే నిర్ణయాలు మాత్రం అమలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలైన పరిణామాలు కనిపించాయి దీంతో, ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.. 19 వేల పైచిలుకున్న స్టీల్ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 8 వేలకు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోందని సమాచారం. ఉత్పత్తిపై దుష్ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎండీని తప్పించడం వెనుక ప్రభుత్వ వ్యూహం ఏమిటి..? ఈ రోజు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచిచూడాల్సి ఉంది.
మరోవైపు.. విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించిన కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి.. 45 రోజుల్లో అన్నీ చక్కబడతాయని, ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రశ్నేలేదని ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత పరిణామాలు చూస్తే 2025 నాటికి 2500 మందికి వీఆర్‌ఎస్ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైందనే చర్చ సాగుతోంది. ఇందుకోసం రూ.1260 కోట్లు సిద్ధం చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. నాగర్‌నార్ స్టీల్‌ప్లాంట్‌లో సాంకేతికంగా అనుభవజ్ఞులైన కార్మికులు లేరని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే విశాఖ యాజమాన్యం 500 మందిని డిప్యుటేషన్‌పై పంపేయాలని నిర్ణయం చేయడం చూస్తే వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఖాళీ అయిపోతుందన్న అనుమానాలకు తావు ఇచ్చింది.
మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చాయి. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై చంద్రబాబు, పవన్, పురుందేశ్వరి ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. ఈ రోజు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అంటూ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.