Afghan Funds : ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి స్తంభింపచేసిన నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని అమెరికా తెగేసి చెప్పింది. ఈ మేరకు శ్వేత సౌధం ప్రతినిధి జెన్ సకి ప్రకటన విడుదల చేశారు. నిధులు విడుదల చేసేందుకు సమస్యలు ఉన్నాయని, తాలిబన్లకు ఈ నిధులు ఇచ్చేది లేదని అమెరికా తేటతెల్లం చేసింది.ఆఫ్ఘన్ నిధులు సెప్టెంబర్ 11 దాడుల బాధితులకు అందించాలనే డిమాండ్ బలంగా ఉందని, ఇది ముఖ్యమైన అంశమని శ్వేత సౌధం వర్గాలు స్పష్టం చేశాయి.
అంతేకాకుండా తాలిబన్లను అమెరికా ఇంకా ఉగ్రవాదులుగానే పరిగణిస్తోంది. తాలిబాన్ ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో ఎక్కువ మంది ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్టులో ఉన్నారు. అమెరికా నిధులు విడుదల చేసినా తాలిబన్లు ఆఫ్ఘన్ ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా వినియోగిస్తారో వారి దగ్గర నిర్దిష్టమైన కార్యాచరణ లేదు. నిధులు విడుదల చేస్తే తాలిబన్లు ఇచ్చిన మాట మీద నిలబడతారా అనే అనుమానం అమెరికాను వెంటాడుతోంది. మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరిస్తే పెనుముప్పు సంభవించే ప్రమాదం ఉంది.ఆఫ్ఘన్ కు చెందిన 9.5 బిలియన్ డాలర్ల నిధుల్ని సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా స్తంభింపచేసింది. సుమారు 20 ఏళ్ళ నుంచి ఆ నిధులు అమెరికా వద్దనే ఉన్నాయి.
అయితే ఆఫ్ఘన్ ప్రజలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, నిధుల కొరతతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని తాలిబన్లు అంటున్నారు.
Also Read : తాలిబన్లను అమెరికా గుర్తించాలి