లఖింపూర్ ఖేరి దుర్ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని యుపి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర అడిషనల్ డిజి ప్రశాంతకుమార్ మీడియాకు వెల్లడించారు. భారతీయ కిసాన్ నాయకుడు రాకేశ్ తికాయత్ తో కలిసి మీడియాతో మాట్లాడిన పోలీసు ఉన్నతాధికారి రైతుల ఫిర్యాదులో పేర్కొన్న నిందితులపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు.
దుర్ఘటనలో చనిపోయిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒకరికి 45 లక్షల చొప్పున పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామని యుపి ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డవారికి పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రైతు కుటుంబాలను, రైతు సంఘాల నాయకులను మాత్రమె దుర్ఘటన స్థలానికి అనుమతిస్తామని ప్రభుత్వం వివరించింది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నదున రాజకీయ పార్టీల నేతలు, ఇతర రాష్ట్రాల వారిని లఖింపూర్ ఖేరి జిల్లాలో పర్యటనకు అనుమతి ఇవ్వటం లేదని అడిషనల్ డిజి ప్రశాంత్ కుమార్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ హామీతో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసేందుకు ఆందోళనకారులు సమ్మతించారు.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు లఖింపూర్ ఖేరి ఘటనను తీవ్రంగా ఖండించాయి. బిజెపి యేతర పార్టీలు ఘటన స్థలం సందర్శించేందుకు సన్నాహాలు చేయటం, రాజకీయంగా ఉత్తారప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా రైతులతో వివాదం బిజెపికి ప్రాణసంకటంగా తయారైంది.