ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ విజయాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, వేడుకలు చేసే వారిని దేశ ద్రోహులుగా పరిగణిస్తామని యోగి అధిత్యనాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లక్నోలో ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియా పాకిస్తాన్ ల మధ్య జరిగిన టి 20 మ్యాచ్ లో పాక్ విజయం సాధించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ విజయాన్ని అభినందిస్తూ కొందరు వేడుకలు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కశ్మీర్ లో ఇప్పటికే కొందరు యువకుల్ని అరెస్టు చేశారు.
పాకిస్తాన్ కు మద్దతుగా వేడుకలు చేసుకున్నవారి గురించి సోషల్ మీడియా పోస్టులు, మీడియా, దిన పత్రికల ఆధారంగా ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు. ఐదు జిల్లాల్లో ఈ దుస్సాహసానికి పాల్పడ్డారని మరికొంతమందిని అదుపులోకి తీసుకోవల్సి ఉందని యుపి పోలీసులు వెల్లడించారు.
మరోవైపు రాజస్థాన్లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ప్రఖ్యాత నీరజా మోదీ స్కూల్ లో నఫీసా అట్టారి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. మొన్న ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ తర్వాత తన వాట్సాప్ స్టేటస్లో We Won అని పెట్టిందంట. స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఆమె వాదన ఏమిటంటే తమ కుటుంబంలో కొందరు ఇండియాకు, మరి కొందరు పాక్ కు సపోర్టు చేసారంట. పాక్ గెల్చింది కాబట్టి తను అలా పెట్టానని వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేకపోయింది. పాఠశాల యాజమాన్యం నఫీసా అట్టారి మొర ఆలకించలేదు.